పాలమూరు–రంగారెడ్డిని పక్కనపెట్టేశారు
నీటి హక్కులను వదిలేశారు!
90 టీఎంసీలపై హక్కు కోల్పోయాం
ఏపీ నల్లమల్ల సాగర్‌తో తెలంగాణకు అన్యాయం
వట్టెం రిజర్వాయర్‌లో వేల కోట్ల అవినీతి ఆరోపణలు
జలవివాదాలకు శ్రీశైలం సోర్స్ే కారణం : కవిత
కాకతీయ, నాగర్‌కర్నూల్ : పాలమూరు–రంగారెడ్డిని పక్కనపెట్టి నీటి హక్కులను సైతం వదిలేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను వదిలేశారు. జాగృతి జనం బాటలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించిన కవిత పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లాలో కవిత పర్యటించారు. ఈసందర్భంగా ఆమె వేర్వేరు కార్యక్రమాల్లో మాట్లాడుతూ ప్రభుత్వంపై, బీఆర్ ఎస్ నేతలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం మాదిరిగా పాలమూరు–రంగారెడ్డిని పరుగులు పెట్టించకపోవడం వల్ల తెలంగాణ 90 టీఎంసీల నీటి వాటాపై హక్కు కోల్పోయిందని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తయ్యి ఉంటే ఇప్పటికే అదనపు నీళ్లపై చట్టబద్ధమైన హక్కు వచ్చేదని అన్నారు. ఏపీ వరద నీళ్ల పేరుతో నల్లమల్ల సాగర్ నిర్మిస్తోందని, దాని వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కడుతున్నట్లే తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి సోర్స్‌ను శ్రీశైలం నుంచి తీసుకోవడం శాశ్వత జలవివాదాలకు కారణమవుతుందని స్పష్టం చేశారు. జూరాల నుంచి నీటి సోర్స్ తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. వట్టెం రిజర్వాయర్‌లో నల్లమట్టి పేరుతో తీసుకున్న 900 ఎకరాల భూములు ఇప్పటికీ కాంట్రాక్టర్ల చేతిలోనే ఉన్నాయని ఆరోపించారు. ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నించారు. కొంచెం పనులతో పూర్తయ్యే ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఇది స్పష్టమైన అవినీతేనని వ్యాఖ్యానించారు.
జిల్లాకు రైలు మార్గం లేకపోవడం దారుణం..
నాగర్‌కర్నూల్ జిల్లాకు రైలు మార్గం లేకపోవడం దారుణమని, గద్వాల–మాచర్ల రైల్వే లైన్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యత స్థానిక ఎంపీ తీసుకోవాలని అన్నారు. అటవీ వనరులు, పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లెల తీర్థాన్ని ‘తెలంగాణ ఊటీ’గా అభివృద్ధి చేయవచ్చని సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన 550 టీఎంసీలను పూర్తిగా వినియోగించుకోలేకపోయామని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం ఇందుకు ప్రధాన కారణమని కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్న హక్కులనే వదులుకుందని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో అవకతవకలపై జాగృతి తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా జాగృతి జనం బాట కొనసాగుతుందని, ప్రజల సమస్యలపై కమిటీల ద్వారా ఉద్యమాలు చేపడతామని కవిత తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలంటే జలహక్కులు, వనరుల పంపిణీ న్యాయంగా జరగాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.


