నేడే ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల సమరం
ప్రోగ్రెసివ్–మన ప్యానెల్ మధ్య హోరాహోరీ
అగ్ర నిర్మాతల మద్దతుతో రంగంలో రెండు వర్గాలు
చిన్న–పెద్ద నిర్మాతల మధ్య భావజాల పోరు
కాకతీయ, హైదరాబాద్ : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2025–27 కార్యవర్గ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఛాంబర్ కార్యాలయంలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొనడంతో పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో విభాగాలకు చెందిన ప్రతినిధులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కు అల్లు అరవింద్, డి. సురేశ్ బాబు, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. పరిశ్రమ అభివృద్ధి, ఆధునిక విధానాలు, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని ఈ వర్గం ప్రకటిస్తోంది. ఈసారి ఎగ్జిబిటర్ల వంతు కావడంతో అధ్యక్ష పదవికి డి. సురేశ్ బాబు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మన ప్యానెల్ వ్యూహం
మన ప్యానెల్‌కు చదలవాడ శ్రీనివాసరావు, సి. కళ్యాణ్, తుమ్మల ప్రసన్న కుమార్, నట్టి కుమార్ నాయకత్వం వహిస్తున్నారు. చిన్న నిర్మాతలకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తుతూ, థియేటర్ల కేటాయింపులో సమానత్వం, చిన్న సినిమాలకు ఐదో షో అవకాశం వంటి హామీలతో ప్రచారం సాగిస్తున్నారు. పరిశ్రమ కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైందని ఈ వర్గం ఆరోపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దిల్ రాజుపై సి. కళ్యాణ్, నట్టి కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రతిగా పరిశ్రమ మనుగడకు ఐక్యత అవసరమని, వ్యక్తిగత ఆరోపణలు తగవని ప్రోగ్రెసివ్ ప్యానెల్ నేతలు స్పష్టం చేస్తున్నారు. నాలుగు కీలక విభాగాలకు సంబంధించిన ప్రతినిధుల ఎన్నికలతో పాటు ఛాంబర్ భవిష్యత్ దిశను ఈ ఫలితాలు నిర్దేశించనున్న నేపథ్యంలో, టాలీవుడ్ వర్గాలు ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


