ఉపాధి పనుల్లో వేగం పెంచాలి!
నర్సరీల ఏర్పాటుకు తక్షణ చర్యలు
పశువుల షెడ్‌లు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి
నాణ్యతపై రాజీ పడొద్దు : వరంగల్ జడ్పీ సీఈఓ, ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓ రాంరెడ్డి
క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ
కాకతీయ, గీసుగొండ : ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న నర్సరీలు, పశువుల షెడ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జడ్పీ సీఈఓ, ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓ రాంరెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని కొనాయిమాకుల, ఊకల్ గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని నర్సరీల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని రాంరెడ్డి సూచించారు. వెంటనే ఎర్రమట్టి తెప్పించి నర్సరీ బ్యాగులను నింపి విత్తనాలు నాటాలని ఆదేశించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా నీడనిచ్చే మొక్కలు, పూల మొక్కలు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలను విస్తృతంగా పెంచాలని తెలిపారు. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాలకు దీర్ఘకాల ప్రయోజనం కలుగుతుందన్నారు.
పశువుల షెడ్ల పనులు పూర్తి చేయాలి
ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పశువుల షెడ్ల నిర్మాణాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. షెడ్ల నిర్మాణం ద్వారా పశుపోషణకు ఊతం లభిస్తుందని, రైతులు, పశుపాలకులకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అన్ని పనులు నాణ్యతతో పాటు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తయ్యేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని రాంరెడ్డి ఆదేశించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధి హామీ పనులు గ్రామీణ ఉపాధికి కీలకమని, అందుకే ప్రతి పనిని బాధ్యతగా పూర్తి చేయాలన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎంపీఓ పాక శ్రీనివాసులు, ఏపీఓ చంద్రకాంత్, ఈసీలు, టీఏలు, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.


