కాంగ్రెస్ విజయాలను ఎవరూ ఆపలేరు
సాకారం అవుతున్న పేదల కలలు!
ప్రజా ప్రభుత్వంలో హామీల అమలు
గ్రామాలాభివృద్ధే మా ప్రభుత్వం లక్ష్యం
: మంత్రి పొంగులేటి
మరిపెడలో రూ.6.50 కోట్ల పనులకు శంకుస్థాపన
కాకతీయ, మరిపెడ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రజా ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పేదల కలలు నెరవేరుతున్నాయని, అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతోందని ఆయన తెలిపారు. శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సుమారు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ, బీటీ రోడ్లు, వర్షపు నీటి కాలువలు సహా పలు అభివృద్ధి పనులకు డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్‌తో కలిసి మంత్రి శంకుస్థాపనలు చేశారు.
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధిని ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని, రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
డోర్నకల్ నియోజకవర్గంలో గత పాలనలో అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని మంత్రి విమర్శించారు. వచ్చే పది ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే విజయం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలే బలం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విస్తృత మద్దతు తీసుకొస్తాయని మంత్రి అన్నారు. ఈ పథకాలే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేము నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, కాలం రవీందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎస్‌కే తాజుద్దీన్, పానుగోతు రామ్‌లాల్, బంక ప్రమోద్, అన్వర్ పాశా, అఫ్జల్, రవికాంత్, వెంకన్న, వేణు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


