టేకాఫ్ అవుతున్న ఎయిర్‌పోర్టు
ఏఏఐ చేతికి భూముల అప్పగింత
253 ఎకరాలు సేకరించిన రాష్ట్రం
ఎకరానికి రూ.1.20 కోట్ల పరిహారం
జనవరిలో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ మామునూరు విమానాశ్రయ పునర్నిర్మాణానికి మరో కీలక మైలురాయి దాటింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం శనివారం అధికారికంగా అప్పగించింది. దీంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణకు స్పష్టమైన దారి తెరచుకుంది. శనివారం ఏఏఐ హైదరాబాద్ జనరల్ మేనేజర్ బీవీ రావు బృందంతో కలిసి వరంగల్ కలెక్టరేట్‌కు చేరుకోగా, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో భూసంబంధిత పత్రాలను అధికారులకు అందజేశారు. అన్ని అనుమతులు, భూసేకరణ పూర్తికావడంతో 2026 జనవరిలో పునర్నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వరంగల్‌తో పాటు ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఈ ఎయిర్‌పోర్ట్ గేమ్‌చేంజర్‌గా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.

రైతులకు భారీ పరిహారం
విమానాశ్రయ విస్తరణకు అవసరమైన అదనపు భూముల కోసం మామునూరు పరిసర గ్రామాలైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి ప్రాంతాలకు చెందిన రైతుల నుంచి మొత్తం 253 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఒక్కో ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున పరిహారం చెల్లిస్తూ కేవలం ఏడాది కాలంలో భూసేకరణను పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో 136 మంది రైతులు, స్థానికులు భూములు కోల్పోయినా, న్యాయమైన పరిహారం అందడంతో వారు సహకరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే మామునూరు పాత విమానాశ్రయ పరిధిలో 696.14 ఎకరాల భూమి ఏఏఐ పరిధిలో ఉంది. నూతన విస్తరణకు కావాల్సిన భూముల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసింది. గతంలో భూసేకరణ, పునరావాస వ్యయాల కోసం మరో రూ.250 కోట్లు కేటాయించగా, కేంద్ర విమానయాన శాఖ కూడా రూ.450 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిధుల కొరత లేకుండా పనులు ముందుకు సాగుతున్నాయి.
నిజాం కాలం నుంచే విమానాశ్రయం
1930లో నిజాం పాలనలోనే మామునూరులో విమానాశ్రయం ఏర్పాటైంది. 1980లో కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, అప్పటి నుంచి పునరుద్ధరణపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. 2007లో రీజినల్ కనెక్టివిటీ పథకం కింద అభివృద్ధి ప్రతిపాదనలు వచ్చినా, వివిధ కారణాలతో కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది.


