జీఓ 252ను సవరించాలి
అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు ఇవ్వాలి
గ్రామీణ, చిన్న పత్రికలపై నిబంధనల భారమా?
కలెక్టర్‌కు టీఎస్‌జేయూ వినతి
కాకతీయ, వరంగల్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్–252లోని లోపాలను తక్షణమే సవరించి, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టీఎస్‌జేయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ నాయకులు శనివారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుత జీఓ నిబంధనల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, చిన్న పత్రికలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే పాత్రికేయుల సేవలను గుర్తించి, అక్రిడేషన్ నిబంధనలను సరళీకృతం చేయాలని వారు కోరారు. ఈ అంశంపై స్పందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద… జీఓ 252లో ఉన్న లోపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ అందేలా చూడటానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అలాగే చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో టీఎస్‌జేయూ వరంగల్ ఉపాధ్యక్షులు ఈద శ్రీనాథ్, యూనియన్ సభ్యులు అడుప అశోక్‌కుమార్, అవినాష్, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


