ఎన్నికల్లో గెలుపోటములు సహజమే
ఓటమితో నిరాశకు లోనుకావొద్దు
ప్రజాసేవ సంకల్పం కొనసాగాలి
భవిష్యత్తులో మరింత బలంగా ముందుకు
బీఆర్‌ఎస్ శక్తిని చాటాల్సిన సమయం ఇదే
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాకతీయ, ఆత్మకూరు : ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమేనని, ఓడిపోయామని నిరాశ చెందాల్సిన అవసరం లేదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన నాయకులను ఆయన పరామర్శించి మాట్లాడారు. ప్రజల కోసం పనిచేయాలనే సంకల్పం ఓటమితో ఆగిపోదని స్పష్టం చేశారు.
గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన అభ్యర్థులు ప్రజల మనసుల్లో ఇప్పటికే గెలిచారని చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. స్వల్ప తేడాతో ఓటమి ఎదురైనా, భవిష్యత్తులో ప్రజల మద్దతుతో మరింత బలంగా ముందుకు సాగాలని నాయకులకు సూచించారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తే విజయం తానే వస్తుందని తెలిపారు.
కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపిన నాయకుడు
ఓటమిపాలైన నాయకులు నిరుత్సాహానికి లోనుకాకుండా ప్రజల మధ్యే ఉండి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో గ్రామస్థాయిలో సమస్యలపై కలిసికట్టుగా పోరాటం సాగిస్తామని చెప్పారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తన సత్తాను చాటాలని చల్లా ధర్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పనిచేస్తే విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


