బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం
ముంబైలో 60 సీట్లలో పోటీకి సన్నద్ధం
ముంబై : జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఐక్యత చర్చలు తాత్కాలికంగా వాయిదా పడగా, అజిత్ పవార్ వర్గం బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి సిద్ధమవుతోంది. ముంబైలో సుమారు 60 సీట్లకు అభ్యర్థులను నిలబెట్టేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సునీల్ తట్కరే నేతృత్వంలో మూడో విడత సమావేశాలు ముగిశాయి. అభ్యర్థుల ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయని, ఇప్పటికే ప్రాథమిక జాబితా సిద్ధమైందని ఎమ్మెల్యే సనా మాలిక్ తెలిపారు. నవాబ్ మాలిక్‌ను ముంబై కోఆర్డినేటర్‌గా నియమించడాన్ని చూపుతూ శివసేన, బీజేపీ బీఎంసీ సీట్ల చర్చల్లో ఎన్సీపీని దూరంగా పెట్టినట్లు సమాచారం. అయినా ఎన్నికల్లో శివ్–షాహు–ఫూలే–అంబేడ్కర్ సిద్ధాంతాలతో పోటీ చేస్తామని సనా మాలిక్ స్పష్టం చేశారు. పుణె, పింప్రి–చించ్వడ్ విషయాల్లో తుది నిర్ణయం ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తీసుకుంటారని తట్కరే తెలిపారు. ఎన్నికల అనంతరం మహాయుతితో పొత్తుకు కూడా అవకాశం ఉందని ఎన్సీపీ వర్గాలు సూచించాయి.


