సంక్షోభంలో ప్రజాస్వామ్యం
పేదల కడుపుకొట్టేందుకే ఉపాధి పథకం రద్దు
కార్పొరేట్లకే కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యం
మహాత్మాగాంధీ ఆలోచనలకు అవమానం
ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం
ప్రజా ఉద్యమానికి శ్రేణులు సిద్ధం కావాలి
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
కాకతీయ, న్యూఢిల్లీ : దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర సంక్షోభంలో ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తోందని విమర్శించారు. పేదల సంక్షేమాన్ని పక్కనపెట్టి కార్పొరేట్లకు అనుకూలంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను నిర్వీర్యం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేదల కడుపుకొట్టిందని ఖర్గే మండిపడ్డారు. ఈ పథకం ద్వారా కోట్లాది కుటుంబాలకు జీవనాధారం లభించిందని, దానిని బలహీనపరచడం పేదలపై దాడితో సమానమన్నారు.
గాంధీని అవమానించడమే
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి పథకాన్ని నిర్వీర్యం చేయడం జాతిపిత మహాత్మాగాంధీ ఆలోచనలను, ఆశయాలను అవమానించడమేనని ఖర్గే వ్యాఖ్యానించారు. గాంధీ ఆశించిన సమానత్వం, సామాజిక న్యాయం బీజేపీ పాలనలో కనుమరుగవుతున్నాయని విమర్శించారు. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో కేంద్రీకరిస్తూ, పేదలు, మధ్యతరగతి ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు, కార్మికులు, యువత సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్ సిద్ధం
ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి సిద్ధమవ్వాలని ఖర్గే పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాటానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఖర్గే తెలిపారు.


