జీవో 252ను రద్దు చేయాలి
డెస్క్ జర్నలిస్టులపై ప్రభుత్వం వివక్ష
కొత్త జీవోతో చిన్న పత్రికలు, కేబుల్ ఛానళ్లకు దెబ్బ
పది వేల మందికి అక్రిడిటేషన్ కోల్పోయే ప్రమాదం
టీయూడబ్ల్యూజే (హెచ్–143) జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన
జిల్లా నలుమూలల నుంచి భారీగా హాజరు
అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో ఎంఎస్ నెం.252 (తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు–2025)ను తక్షణమే సవరించాలని లేదా పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే – హెచ్ 143) ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు గురువారం భారీగా నిరసన చేపట్టారు.
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన జర్నలిస్టులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (హెచ్–143) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ మాట్లాడుతూ, కొత్త అక్రిడిటేషన్లు జారీ చేయడం స్వాగతార్హమే అయినా, జీవో 252లోని నిబంధనలు జర్నలిస్టుల మధ్య విభేదాలకు దారితీస్తున్నాయని అన్నారు. ఫీల్డ్, డెస్క్ అనే తేడా లేకుండా అందరినీ ఒకే విధంగా అక్రిడిటెడ్ జర్నలిస్టులుగా గుర్తించాలని, డెస్క్ జర్నలిస్టులకు జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు, స్టాఫ్ రిపోర్టర్లు, టౌన్ రిపోర్టర్లు, సీనియర్ జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొని జీవోలోని నిబంధనలు జర్నలిస్టుల వృత్తి స్వేచ్ఛను హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 252లో డెస్క్ జర్నలిస్టులకు పూర్తి అక్రిడిటేషన్ కార్డు ఇవ్వకుండా కేవలం మీడియా గుర్తింపు కార్డు మాత్రమే ఇవ్వాలనే నిబంధనను విధించడం ద్వారా జర్నలిస్టుల మధ్య అనవసర విభజన సృష్టిస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. ఫీల్డ్, డెస్క్ అనే తేడా లేకుండా ప్రతి జర్నలిస్టూ వార్తా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
చిన్న మీడియాపై ప్రభావం
15 వేల కంటే తక్కువ సర్క్యులేషన్ ఉన్న చిన్న పత్రికలు, కేబుల్ టెలివిజన్ ఛానళ్లు, స్వతంత్ర జర్నలిస్టులపై కఠిన నిబంధనలు విధించడం వల్ల వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవో అమలులోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. జీవోలోని అర్హత ప్రమాణాలు స్పష్టత లేకుండా ఉండటంతో పాటు, కొన్ని వర్గాలకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయని జర్నలిస్టులు విమర్శించారు.
అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం
నిరసన అనంతరం టీయూడబ్ల్యూజే ప్రతినిధులు జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జీవో 252ను వెంటనే పునఃసమీక్షించి జర్నలిస్టులందరినీ సమానంగా గుర్తించేలా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ప్రకాష్ రావు, వేణుగోపాలరావు, జిల్లా నాయకులు జెర్రిపోతుల సంపత్, రామకృష్ణ, హృషికేష్, కొండల్ రెడ్డి, యాదగిరి, డెస్క్ జర్నలిస్టుల నాయకులు సుభాష్, సంపత్, శ్రీనివాస్‌తో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.


