నేరాలు పెరిగాయి.!
కమిషనరేట్‌లో 14,456 కేసులు నమోదు
65 శాతం కేసులు మాత్రమే పరిష్కారం
ఆందోళన కలిగిస్తున్న పోక్సో కేసుల పెరుగుదల
సైబర్ నేరాల్లో రూ.12.42 కోట్ల మోసాలు
మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు
డ్రంకన్ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపుతాం
డ్రగ్స్, రౌడీషీట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం
వార్షిక నివేదికను వెల్లడించిన వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేరాల నివేదికను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల రేటు 3 శాతం పెరిగినప్పటికీ, పోలీసుల నిరంతర పర్యవేక్షణ, సాంకేతిక నిఘా, ప్రత్యేక బృందాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినట్లు సీపీ తెలిపారు. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో మొత్తం 14,456 కేసులు నమోదు కాగా, వాటిలో 9,098 కేసులను విజయవంతంగా పరిష్కరించి 65 శాతం పరిష్కార రేటు సాధించినట్లు వెల్లడించారు. బాధితులకు త్వరిత న్యాయం అందించాలనే లక్ష్యంతో 1,011 నాన్‌బెయిలబుల్ వారెంట్లను అమలు చేసినట్లు తెలిపారు.
మహిళా భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం
మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ మహిళా పోలీస్ అధికారులతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. నర్సంపేట పోలీస్ స్టేషన్లో కొత్తగా షీటీమ్‌ను ప్రారంభించామని, దీని వల్ల మహిళలపై వేధింపుల కేసులు తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. షీటీమ్ కేసులు 2024లో 243 ఉండగా, 2025లో 209కు తగ్గినట్లు వెల్లడించారు. అయితే పోక్సో కేసులు గత ఏడాదితో పోలిస్తే పెరిగినట్లు నివేదికలో వెల్లడైంది. 2024లో 364 పోక్సో కేసులు నమోదు కాగా, 2025లో 405 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇది సమాజానికి హెచ్చరికగా పేర్కొంటూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ స్థాయిలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
నేరస్తులకు కఠిన శిక్షలు
నేరాలకు పాల్పడిన వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడినట్లు సీపీ వెల్లడించారు. ఈ ఏడాది 16 కేసుల్లో జీవిత ఖైదు శిక్షలు, మూడు కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్షలు విధించబడినట్లు తెలిపారు. ఇవి నేరాలకు పాల్పడేవారికి గట్టి హెచ్చరికగా నిలుస్తాయని అన్నారు. ప్రజలకు త్వరిత న్యాయం అందించేందుకు నిర్వహించిన లోక్ అదాలత్‌ల ద్వారా 9,398 ఎఫ్ఐఆర్ కేసులు, 18,197 ఈ-పెట్టీ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో 630 సైబర్ నేరాలు నమోదైనట్లు సీపీ తెలిపారు. పెట్టుబడి మోసాలు, పార్ట్‌టైమ్ జాబ్ మోసాలు, ఓటీపీ మోసాలు, ఏపీకే ఫైల్, కస్టమర్ కేర్ పేరుతో మోసాలు, లోన్ మోసాల ద్వారా మొత్తం రూ.12.42 కోట్ల మేర మోసం జరిగినట్లు వెల్లడించారు.
ఈ కేసుల్లో పోలీసులు రూ.61 లక్షలు రికవరీ చేయగా, ఇప్పటివరకు బాధితులకు రూ.19.70 లక్షలు తిరిగి చెల్లించినట్లు తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు. డ్రంకన్ డ్రైవ్‌లో 35,513 మందిపై కేసులు నమోదు చేసి రూ.2.19 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు. 887 మందికి జైలు శిక్షలు, 329 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది 1,424 రోడ్డు ప్రమాదాల్లో 430 మంది మృతి చెందగా, 406 మంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రమాదాలు, మృతులు కొంత మేర తగ్గినట్లు సీపీ పేర్కొన్నారు. ఎన్డిపిఎస్ కేసుల్లో రూ.8.62 కోట్ల విలువైన నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకొని 482 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కొత్తగా 45 రౌడీషీట్లు ఓపెన్ చేయగా, కమిషనరేట్ పరిధిలో మొత్తం 719 మంది రౌడీషీటర్లు ఉన్నారని వెల్లడించారు. భవిష్యత్తులో మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు భద్రతపై మరింత దృష్టి సారిస్తామని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు.


