సర్పంచ్ ఎన్నికలే ప్రజాపాలనకు నిజమైన ముద్ర
ఎక్కువ గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థుల గెలుపు
బీజేపీ–బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు పనిచేయలేదు
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్
కాకతీయ, హుజురాబాద్ : ప్రజా పాలనకు నిజమైన ఆమోద ముద్ర సర్పంచ్ ఎన్నికలేనని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో పార్టీ విజయ పరంపర కొనసాగుతోందని పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ పట్టణంలోని ఇందిరా భవన్ (డీసీసీ) కార్యాలయంలో నిర్వహించిన నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ప్రణవ్ పాల్గొని మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందడం ప్రజలు కాంగ్రెస్ పాలనపై నమ్మకం ఉంచినట్లేనని అన్నారు.
హుజురాబాద్‌కు ఎక్కువ నిధులు
హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ సర్పంచులు ఎన్నికయ్యారని, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలంటే ఎక్కువ నిధులు కేటాయించాలని ఆయన కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. హుజురాబాద్‌లో ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే కలిసి ఎంత ప్రచారం చేసినా కాంగ్రెస్ అఖండ విజయాన్ని ఆపలేకపోయారని ప్రణవ్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందాలతో ప్రయత్నించినా ప్రజల తీర్పు కాంగ్రెస్‌కే అనుకూలంగా వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ వెంకట్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.


