నూతన సర్పంచ్‌లకు ఘన సన్మానం
గ్రామస్థాయిలో కాంగ్రెస్‌కు బలమైన పునాది వేయాలి
: మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లకు డీసీసీ కార్యాలయం ఇందిరా భవన్‌లో శుక్రవారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన సర్పంచ్‌లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ బలమురి వెంకట్, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, హుజూరాబాద్ ఇన్‌చార్జి ఓడితల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
గ్రామస్థాయిలో కాంగ్రెస్‌కు పునాది వేయాలి..
కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్‌లు గ్రామాల్లో పార్టీ ప్రతినిధులుగా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను పరిష్కరించడమే సర్పంచ్‌ల ప్రధాన కర్తవ్యమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చివరి వ్యక్తి వరకు చేరేలా చూడాలని, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఎన్నికల కారణంగా నిలిచిపోయిన నిధులు త్వరలో విడుదలవుతాయని, ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయిస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, శానిటేషన్, వీధి దీపాలు, హరితహారం, మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్పంచ్‌లు కృషి చేయాలని, ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా చూడాలని పిలుపునిచ్చారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలని అన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. ఈనెల 28న గాంధీ విగ్రహాల వద్ద, ఉపాధి హామీ పనుల ప్రాంతాల్లో గాంధీ చిత్రాలతో నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ ఐక్యంగా పనిచేయాలని, గెలిచిన వారితో పాటు ఓడిన అభ్యర్థులను కూడా కలుపుకొని ముందుకు సాగుతామని మంత్రి స్పష్టం చేశారు. చివరగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ముఖ్యమంత్రి, పీసీసీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.


