రాంగ్‌రూట్ లారీ బీభత్సం
తృటిలో తప్పిన పెను ప్రమాదం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని అలుగునూర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో రాజీవ్ రహదారిపై శనివారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. ఎదురెదురుగా ఢీకొన్న లారీల ప్రభావంతో గ్రానైట్ లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాద సమయంలో క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించగా, సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్‌ను తొలగించి డ్రైవర్‌ను బయటకు తీసి, వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రమాదానికి కారణమైన రాంగ్‌రూట్ లారీ డ్రైవర్ ఘటన అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న డ్రైవర్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను సర్దుబాటు చేశారు.


