డిస్నీల్యాండ్ హై స్కూల్‌లో ఘనంగా సిల్వర్ జూబ్లీ
25 ఏళ్ల విద్యా ప్రస్థానానికి అంగరంగ వైభవం
850 మంది విద్యార్థుల క్రమశిక్షణాయుత మార్చ్‌పాస్ట్ ఆకర్షణ
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా దామెర మండలం ఓగులపూర్ గ్రామంలోని డిస్నీల్యాండ్ హై స్కూల్‌లో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించగా, నిర్వహించిన కార్యక్రమాలు కనుల పండుగగా సాగాయి. ఉత్సవాల ప్రారంభానికి ముందు 850 మంది విద్యార్థులు క్రమశిక్షణతో నిర్వహించిన మార్చ్‌పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల క్రమబద్ధత, శాసనబద్ధ నడకను చూసి అతిథులు ప్రశంసలు కురిపించారు.
25 ఏళ్ల విజయవంతమైన ప్రయాణం
అనంతరం జరిగిన సమావేశంలో పాఠశాల వ్యవస్థాపకులలో ఒకరైన దయ్యాల సదయ్య మాట్లాడుతూ, పాఠశాల స్థాపన నుంచి ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలను వివరించారు. 2001లో 190 మంది విద్యార్థులతో ప్రారంభమైన డిస్నీల్యాండ్ హై స్కూల్ నేడు 850 మంది విద్యార్థులతో 25 ఏళ్ల విజయవంతమైన విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని తెలిపారు. విద్యలో నాణ్యత, క్రమశిక్షణే పాఠశాల ప్రధాన బలమని పేర్కొన్నారు.
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల ఏసీపీ సి. సతీష్ బాబు, హనుమకొండ జిల్లా కో-ఆపరేటివ్ అధికారి బొక్క సంజీవరెడ్డి, తిరుపతి డీఎస్పీ (అసెంబ్లీ, హైదరాబాద్) ఎల్. రాజేష్, దామెర మండల విద్యాధికారి కె. అశోక్, సబ్ ఇన్స్పెక్టర్ దామెర హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలకే కాకుండా గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మీ నివాసం డైరెక్టర్లు బి. శోభారాణి, డి. రాకేష్ భాను, డి. దినేష్ చందర్, కుటుంబ సభ్యులు డా. పవన్, విజయలక్ష్మి, మౌనిక, కావ్య, మీనా, శ్రీలత, శ్రావణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు మరింత ఘనంగా నిర్వహించనున్నట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.


