ఖేలో ఇండియా నిధులతో జమ్మికుంటలో అథ్లెటిక్ ట్రాక్
కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి ఫలితం
రూ.6.50 కోట్లతో 4 లైన్ల సింథటిక్ ట్రాక్ నిర్మాణం
బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి
కాకతీయ, జమ్మికుంట : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఖేలో ఇండియా పథకం ద్వారా క్రీడలను గ్రామ స్థాయికి తీసుకువెళ్లాలన్న లక్ష్యానికి జమ్మికుంట పట్టణం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి అన్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమ్మికుంట పట్టణంలో 4 లైన్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణానికి ఖేలో ఇండియా పథకం కింద రూ.6.50 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ నిధులు విడుదలైనట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అంతర్జాతీయ స్థాయి క్రీడా సౌకర్యాలు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ దూరదృష్టికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ట్రాక్ నిర్మాణం పూర్తైతే జమ్మికుంటతో పాటు ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ పరిసర మండలాల యువ అథ్లెట్లకు మెరుగైన శిక్షణ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ అథ్లెటిక్ ట్రాక్ గ్రామీణ ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే బలమైన కేంద్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కు, యువజన వ్యవహారాలు–క్రీడల శాఖ మంత్రి మన్సుక్ మాండవియకు కృతజ్ఞతలు తెలిపారు.


