నాడు దేశసేవ… నేడు ప్రజాసేవ
ఆత్మకూరు సర్పంచ్ మశేశ్వరి రాజుకు రేవూరి అభినందనలు
గ్రామాభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యంగా పనిచేయాలని పిలుపు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపు
కాకతీయ, ఆత్మకూరు : నాడు దేశసేవలో అంకితభావంతో పనిచేసి, నేడు ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి రావడం అభినందనీయమని ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు ను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కొనియాడారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, నూతనంగా ఎన్నికైన ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు, వార్డు సభ్యులను సన్మానించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకున్న నాయకుడిగా పర్వతగిరి మహేశ్వరి రాజు నిలిచారని ఎమ్మెల్యే కొనియాడారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆత్మకూరు ప్రజలు పట్టం కట్టారని గుర్తు చేశారు. పర్వతగిరి మహేశ్వరిని ఎంపీటీసీగా, పర్వతగిరి రాజును సర్పంచ్‌గా భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలే, ఇప్పుడు మరోసారి సర్పంచ్‌గా గెలిపించారని పేర్కొంటూ ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
రాజకీయ కక్షలు తగవు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆనాడు పర్వతగిరి రాజుపై ఎస్సీ, ఎస్టీ వంటి తప్పుడు కేసులు పెట్టి పదవి నుంచి తొలగించిన విషయం ఆత్మకూరు ప్రజలకు తెలుసన్నారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఓటమి భయంతోనే అలాంటి మాటలు మాట్లాడారని తీవ్రంగా విమర్శించారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏ ముఖంతో ఆత్మకూరుకు వస్తారని ప్రశ్నించారు. ఆత్మకూరు గ్రామపంచాయితీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడంలో వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని సూచించారు. నిజాయితీపరులకే ఓట్లు వేస్తేనే గ్రామాలు, నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కొందరు నోట్లకు ఓట్లు అమ్ముకోవడం బాధాకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిజాయితీగా పనిచేసే నాయకులకే పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, ఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి శ్వేత, ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ భీరం సునంద సుధాకర్ రెడ్డి, పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదాసి శ్రీధర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కమలాపురం రమేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు వడ్డేపల్లి ప్రసాద్, అలువాల రవి, హౌస్‌బూజుర్గ్ సర్పంచ్ సయ్యద్ మౌల, చౌళ్లపల్లి మాజీ సర్పంచ్ కంచె రవికుమార్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తనుగుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.


