గళం ఎత్తలేని కార్పొరేటర్లు
కౌన్సిల్ సమావేశాల ఊసే లేదు!
ఖమ్మం కార్పొరేషన్‌లో పరిపాలనలో నిర్లక్ష్యం
నిధులు ఉన్నా పనులు లేవు
సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యంత కీలకమైన కౌన్సిల్ సమావేశాలు సకాలంలో నిర్వహించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నగరంలోని వివిధ సమస్యలపై చర్చించి, నిధుల కేటాయింపుపై తీర్మానాలు చేయాల్సిన ఈ సమావేశాలే లేకపోవడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి, నగర సమస్యలను అజెండా రూపంలో చర్చించి, మినిట్స్‌గా నమోదు చేయాలి. గత సమావేశంలో ప్రస్తావించిన అంశాల్లో ఎన్ని పరిష్కారమయ్యాయో తదుపరి సమావేశంలో సమీక్షించాల్సి ఉంటుంది. అయితే ఖమ్మం కార్పొరేషన్‌లో ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గళం ఎత్తలేని కార్పొరేటర్లు
సాధారణంగా డివిజన్లలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించి, మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్తారు. వారు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. కానీ సమావేశాలే లేకపోవడంతో కార్పొరేటర్లు తమ డివిజన్ల సమస్యలను అధికారికంగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. నగరంలోని పలు డివిజన్లలో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, కుక్కలు–కోతుల బెడద వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ పరిష్కారం దొరకడం లేదు. ఇటీవల ఒక అధికార పార్టీ కార్పొరేటర్ కూడా తన డివిజన్ సమస్యలను నేరుగా కమిషనర్ వద్ద విన్నవించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిధులు ఉన్నా పనులు లేవు
డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించినప్పటికీ బిల్లులు విడుదల కావడం లేదని కాంట్రాక్టర్లు పనులకు ముందుకు రావడం లేదు. కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు పలుమార్లు టెండర్లు పిలిచినా స్పందన లేకపోవడం గమనార్హం. కౌన్సిల్ సమావేశం జరిగితే ఈ సమస్యలపై చర్చించి పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 30తో కార్పొరేషన్ పాలకవర్గ పదవీకాలం ముగియనుంది. కొత్త ఏడాదిలోనైనా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి, పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం చూపాలని నగరవాసులు కోరుతున్నారు. లేదంటే కార్పొరేషన్ పరిపాలనపై ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


