జనగణన తొలి విడతకు రంగం సిద్ధం
2026 ఏప్రిల్ నుంచి దేశంలోని ఇళ్ల వివరాల సేకరణ
ముగిసిన ప్రీ- టెస్ట్ ప్రక్రియ
స్వాతంత్య్రం వచ్చాక జరుగుతున్న 8వ సారి..
కాకతీయ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే తొలిసారిగా డిజిటల్‌గా జరగనున్న జనగణన- 2027కు రంగం సిద్ధమైంది. జనాభా లెక్కింపునకు సంబంధించిన ప్రీ- టెస్ట్ ప్రక్రియ ముగిసింది. జనగణన తొలి విడతలో భాగంగా 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు దేశంలోని ఇళ్ల వివరాలను సేకరించనున్నారు. యావత్ దేశంలోని ఇళ్ల వివరాలను ఎలా సేకరించాలి ? ఇందుకోసం ఏ విధమైన మార్గదర్శకాలను అనుసరించాలి? మానవ వనరులను ఎలా మోహరించాలి? అనే దానిపై ప్రీ- టెస్ట్‌లో ముమ్మర కసరత్తు చేశారు. పారదర్శకంగా ఇళ్ల వివరాల సేకరణకు అనుసరించాల్సిన మార్గాలపై అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, ఉప జిల్లాల స్థాయిలోని అధికార వర్గాలతో లోతుగా చర్చించారు. ఇళ్ల సమాచారాన్ని సేకరించడానికి లక్షలాది మానవ వనరులను మోహరించడంపైనా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశామని అధికార వర్గాలు వెల్లడించాయి.
తొలి విడత జనగణనకు కార్యాచరణ ప్రణాళిక
‘గృహాల లిస్టింగ్, గణన’ కోసం 2026 ఏప్రిల్ నుంచి దేశంలోని ప్రతీ ఇంటిని క్షేత్రస్థాయి సిబ్బంది ఎలా చేరుకోవాలి ? ఈక్రమంలో ఇంటి యజమానులను ఏయే ప్రశ్నలు అడిగి, ఎలాంటి సమాచారాన్ని సేకరించాలి ? ఈక్రమంలో మొబైల్ యాప్‌ను ఎలా వాడాలి ? డిజిటల్‌గా సమాచారాన్ని నమోదు చేసే క్రమంలో దోహదపడే భద్రతా ఫీచర్లు ఏమిటి ? సిబ్బందిని రాష్ట్ర, జిల్లా, ఉప జిల్లా స్థాయుల్లో ఎలా వినియోగించాలి ? ఈక్రమంలో అధికారులు ఎలా సమన్వయం చేసుకోవాలి ? అనే అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఇటీవలే జరిగిన ప్రీ- టెస్ట్ ప్రక్రియ దోహదపడిందని అధికార వర్గాలు తెలిపాయి. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు ఇళ్ల వివరాల సేకరణకు జరగనున్న క్లిష్టమైన సుదీర్ఘ కసరత్తుపై క్లారిటీకి రావడానికి ఈ ప్రీ-టెస్ట్ ఉపకరించిందని పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి వెళ్లినప్పుడు భవనాల వివరాలు, ఇళ్ల సమాచారం, కనీస వసతుల (తాగునీరు, పారిశుద్యం, విద్యుత్ వంటివి) గురించి తెలుసుకొని ప్రత్యేక మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారన్నారు.
రూ.11,718 .24 కోట్లతో జనగణన
‘గృహాల లిస్టింగ్, గణన’ ముగిశాక రెండోవిడత జనగణన మొదలవుతుంది. ఇందులో భాగంగా మనదేశంలోని మంచుమయ ప్రాంతాల్లో జనాభా లెక్కల ప్రక్రియను 2026 సెప్టెంబరు నుంచి అక్టోబరు 1 వరకు నిర్వహిస్తారు. మంచుమయ ప్రాంతాల జాబితాలో జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. దేశంలోని అన్ని ఇతర ప్రాంతాల్లో జనగణన 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1 వరకు జరుగుతుంది. రూ.11,718 .24 కోట్లతో జనగణనను నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనకు డిసెంబరు 12నే ప్రధాని మోదీ సారధ్యంలోని కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈసారి జనగణనలో తొలిసారిగా కుల వివరాలను కూడా సేకరించనున్నారు. ఈమేరకు ఈ ఏడాది ఏప్రిల్ 30న కేంద్ర కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇది మన దేశంలో జరుగుతున్న 16వ జనగణన. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరుగుతున్న 8వ జనగణన ఇది.


