రేవంత్ రెడ్డి బజారు భాష మానుకోవాలి..
సీఎం భాషపై అసహ్యం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్
ఆయన్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం నీ వల్ల కాదు
రాజకీయాల్లో మీకు మిగిలింది మూడేళ్లే
బీఆర్ఎస్ ప్రజల పార్టీ : సిరికొండ మధుసూదనాచారి
హనుమకొండలో పార్టీ జిల్లా నేతలతో కలిసి విలేకరుల సమావేశం
కాకతీయ, హనుమకొండ : ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడటం అత్యంత నీతిమాలిన చర్య అని తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి వాడుతున్న భాషపై ప్రజలు తీవ్ర అసహ్యం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి పరాన్నజీవి అయితే కేసీఆర్ స్వయం ప్రకాశమైన నాయకుడని వ్యాఖ్యానించారు. ‘‘నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్‌ను రానివ్వను’’ అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య హాస్యాస్పదమని అన్నారు. రాజకీయాల్లో ఆయనకు మిగిలింది ఈ మూడేళ్లే అన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
తెలంగాణ సాధించిన పోరాట యోధుడు కేసీఆర్
ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప పోరాట యోధుడు కేసీఆర్ అని, కేవలం పదేళ్లలోనే రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్–1గా నిలిపిన పాలనాదక్షుడని సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం కలగానే మిగిలేదని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం అని రెండేళ్లపాటు కేసీఆర్ ఓపికగా గమనించారని, ఈ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. గురుకుల హాస్టళ్లలో వరుస ఘటనలు, యూరియా కోసం రైతుల పడిగాపులు, ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పేరుతో రియల్ ఎస్టేట్ దందాలు పెరిగాయని ఆరోపించారు.
అటకెక్కిన హామీలు
ఆరు గ్యారంటీలు, 420 హామీలు, జాబ్ క్యాలెండర్, మహిళలకు రూ.2,500, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు అన్నీ అటకెక్కాయని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన కేసీఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. అడవి సోమన్‌పల్లి చెక్‌డ్యామ్‌ను పేల్చివేశారన్న విషయాన్ని ‘వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్ స్వయంగా పరిశీలించి స్పష్టం చేశారని తెలిపారు. కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో చర్చకు రమ్మని సవాల్ చేసి, ఆ తర్వాత స్పెషల్ ఫ్లైట్‌లో కేరళకు వెళ్లిన చరిత్ర రేవంత్ రెడ్డిదేనని ఎద్దేవా చేశారు. ఓట్లు వేయించుకుని తరువాత పారిపోవడమే కాంగ్రెస్ రాజకీయ విధానమని విమర్శించారు. ఫార్ములా–ఈ రేస్‌ను రాష్ట్రానికి తీసుకొస్తే దుబారా అంటారని, కానీ ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సితో ఈవెంట్ పెట్టి సింగరేణి నిధులు ఖర్చు చేయడం దుబారా కాదా అని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీని మోసం చేశారని, తెలంగాణ సంపద సృష్టించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. మూడు లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో ఒక్క మేజర్ ప్రాజెక్ట్ అయినా చేపట్టారా అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం పరితపించే పార్టీ కాదని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే ప్రజల పార్టీ అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి భాషా వ్యవహారం మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ చింతల సదానందం, కార్పొరేటర్ చెన్నం మధు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, పులి రజినీకాంత్, శోభన్, నాయీముద్దీన్, రామ్మూర్తి, బుద్దె వెంకన్న, వినీల్ రావు, మూటిక రాజు యాదవ్, గండ్రకోట రాకేష్ యాదవ్, చాగంటి రమేష్, సంపతి రఘు, దేవమ్మ, జేకే, మునుకుంట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


