ఢిల్లీ టూర్‌లో మానకొండూరు జడ్పీ విద్యార్థులు
కేంద్ర మంత్రి నివాసంలో భోజన–వసతి ఏర్పాటు
ఢిల్లీలో జాతీయ ప్రాధాన్య స్థలాల సందర్శన
పార్లమెంట్, పీఎం సంగ్రహాలయానికి పర్యటన
మధుర–ఆగ్రా టూర్‌తో చరిత్రపై అవగాహన
కాకతీయ, కరీంనగర్ : నాలుగు రోజుల ఢిల్లీ–మథుర–ఆగ్రా పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరులోని పీఎం శ్రీ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 60 మంది విద్యార్థులు గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన అధికారిక నివాసంలో భోజన, వసతి సౌకర్యాలతో పాటు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేశారు. పర్యటన తొలి రోజున విద్యార్థులు ఇండియా గేట్, ఎర్రకోట, రాజ్ ఘాట్, అక్షరధామ్ ఆలయం, నార్త్–సౌత్ బ్లాక్‌లను సందర్శించారు. శుక్రవారం భారత పార్లమెంట్, ప్రధానమంత్రుల సంగ్రహాలయాన్ని వీక్షించనున్నారు. అనంతరం హుమాయున్ సమాధి, కుతుబ్ మినార్ వంటి చారిత్రక కట్టడాలను సందర్శించనున్నారు. డిసెంబర్ 27న మథురలో శ్రీకృష్ణ జన్మస్థలం దర్శించిన తర్వాత ఆగ్రాకు వెళ్లి, అదే రోజు సాయంత్రం దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా జమ్మికుంటకు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ పర్యటనతో విద్యార్థులకు దేశ చరిత్ర, సంస్కృతిపై అవగాహన పెరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.


