క్రిస్మస్ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
కాకతీయ, చెన్నరావుపేట : క్రిస్మస్ పండుగ ప్రపంచానికి శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వ సందేశాన్ని అందిస్తుందని ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి చెన్నరావుపేట మండలం తిమ్మరాయన్‌పాడ్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రిస్మస్ కరుణ, శాంతి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవించే సంప్రదాయమే తెలంగాణ ప్రత్యేకత అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, సుఖశాంతులు, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుడి పెద్దలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


