అంజనా టౌన్‌షిప్‌పై తప్పుడు కథనాలు
నిరాధార వార్తలపై చట్టపరమైన చర్యలు తప్పవు
రాజకీయ కక్షతోనే ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణలు
విచారణకు రాకుండా ఫిర్యాదుల పరంపర
ఒక్క గుంట తేలినా మున్సిపాలిటీకి అప్పగిస్తాం
జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపెల్లి రాజేశ్వరరావు
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని అంజనా టౌన్‌షిప్‌పై ఆధారాలు లేని ఆరోపణలతో నిరాధార వార్తలు రాస్తూ, ప్రసారం చేస్తున్న పత్రికలు, ఛానెళ్లపై చట్టపరమైన చర్యలకు పిర్యాదు చేసినట్లు జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపెల్లి రాజేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
తనను రాజకీయంగా ఎదుర్కోలేని కొందరు వ్యక్తులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, అంజనా టౌన్‌షిప్‌లో ప్రభుత్వ భూమిని కబ్జా చేశామంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల సహకారంతో లోకాయుక్తకు పలుమార్లు ఫిర్యాదులు చేస్తూ, విచారణకు మాత్రం హాజరుకాకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు.
అన్ని అనుమతులతో లేఔట్
అంజనా టౌన్‌షిప్ జమ్మికుంట పట్టణానికి తలమానికంగా నిలిచిందని, అన్ని ప్రభుత్వ అనుమతులతోనే లేఔట్ చేయబడిన టౌన్‌షిప్ అని స్పష్టం చేశారు. రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా జరిగిందంటూ అధికారులు వద్దకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, అధికారుల విచారణలో అలాంటి కబ్జా జరగలేదని తేలిందన్నారు. విచారణలో క్లియర్ అయినా అదే అంశాన్ని పదే పదే పునరావృతం చేస్తూ, టౌన్‌షిప్‌లో నివసిస్తున్న సామాన్య కుటుంబాలను అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నిరాధార ప్రచారాలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. విచారణలో ఒకవేళ ఒక్క గుంట ప్రభుత్వ భూమి కబ్జా అయినట్టు తేలినా, ఆ భూమిని మున్సిపాలిటీకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వ భూమి కబ్జా జరిగిందంటూ తప్పుడు కథనాలు ప్రచురించడం సరికాదని అన్నారు. నిరాధార వార్తలు ప్రచురించిన పత్రికలు, ఛానెళ్లకు పరువు నష్టం దావా నోటీసులు పంపించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంజనా టౌన్‌షిప్‌కు సంబంధించిన అన్ని ప్రభుత్వ అనుమతి పత్రాలు, తప్పుడు కథనాల పత్రిక కటింగ్స్‌ను మీడియాకు చూపించారు.


