అటల్ ఆశయాలు తరతరాలకు స్ఫూర్తి
హుజురాబాద్‌లో ఘనంగా అటల్ జయంతి వేడుకలు
ఆశయాలను ఆచరణలో పెట్టాలని బీజేపీ పిలుపు
కాకతీయ, హుజురాబాద్ : భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయి ఆశయాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని బీజేపీ నాయకులు అన్నారు. బీజేపీ హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో అటల్ బీహారి వాజ్‌పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అటల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ… అటల్ బీహారి వాజ్‌పేయి గొప్ప కవి, నిస్వార్థ దేశభక్తుడు, అజాతశత్రువుగా చరిత్రలో నిలిచారని కొనియాడారు. రాజకీయాల్లో విలువలు, పరిపాలనలో పారదర్శకతకు ఆయన జీవితం ప్రతీకగా నిలిచిందన్నారు. ‘ప్రభుత్వాలు వస్తాయి–పోతాయి, పార్టీలు ఏర్పడతాయి–కనుమరుగవుతాయి, కానీ దేశం మాత్రం శాశ్వతం’ అన్న అటల్ మాటలు నేటికీ మార్గదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు.
సుపరిపాలనకు అటల్ దారి
అటల్ జయంతిని కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడమే ఆయన పరిపాలనా దృష్టికోణానికి నిదర్శనమని తెలిపారు. దేశ ఐక్యత, అభివృద్ధి, ప్రజాసేవలే అటల్ ఆశయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, పట్టణ మాజీ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, మాజీ కౌన్సిలర్ పైళ్ళ వెంకట్ రెడ్డి, నల్ల సుమన్, సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, తిప్ప బత్తిని రాజు, కొలిపాక శ్రీనివాస్, ఎంసాని శశిధర్, కొడిమ్యాల పవన్, అంకతి వాసు, యాలసంజీవరెడ్డి, గంట సంపత్, కందుల శ్రీనివాస్, బింగి కరుణాకర్, మోడెప్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.


