కోచ్‌గా రవిశాస్త్రిని నియమించండి
కోచ్ మెకల్లమ్ స్థానంలో రవి శాస్త్రినే సరైన ఎంపిక
ఆస్ట్రేలియాను ఓడించే ఫార్ములా శాస్త్రికే తెలుసు
ఇంగ్లండ్ బోర్డుకు మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సూచనలు
ఆషెస్‌లో ఇంగ్లండ్ ఘోర వైఫల్యంపై సంచలన వ్యాఖ్యలు
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : ఆషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టుకు ఎదురైన పరాభవం తర్వాత ఆ దేశ క్రికెట్‌లో పెద్ద చర్చ మొదలైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 3-0తో వెనుకబడిన ఇంగ్లండ్.. ఆషెస్ తిరిగి దక్కించుకునే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయింది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ భవితవ్యంపై ప్రశ్నార్థకం ఏర్పడింది. మాజీ ఇంగ్లండ్ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెకల్లమ్‌ను తప్పించి, అతని స్థానంలో మాజీ భారత హెడ్ కోచ్ రవి శాస్త్రిని నియమించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆలోచించాలని సూచించారు. జర్నలిస్ట్ రవి బిష్ట్‌తో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాను వారి గడ్డపై ఓడించాలంటే శాస్త్రి లాంటి అనుభవజ్ఞుడే సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు.
ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో శాస్త్రికే తెలుసు
2018-19, 2020-21 సిరీస్‌ల్లో భారత్‌ను ఆస్ట్రేలియాలో వరుసగా విజేతగా నిలిపిన ఘనత రవి శాస్త్రికే దక్కిందని పనేసర్ గుర్తు చేశారు. “ఆస్ట్రేలియా బలహీనతలను మానసికంగా, శారీరకంగా, వ్యూహాత్మకంగా ఎలా వినియోగించుకోవాలో శాస్త్రికి తెలుసు” అని వ్యాఖ్యానించారు. ‘బాజ్‌బాల్ వర్సెస్ ఆస్ట్రేలియా’ అన్న ప్రచారం కేవలం 11 రోజుల్లోనే చల్లారిపోయింది. కీలక ఆటగాళ్లు గాయాలతో, ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడినా.. ఆసీస్ మాత్రం సిరీస్‌ను నిలబెట్టుకుంది. అడిలైడ్ టెస్టులో 435 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే అవకాశాన్ని కోల్పోయిన ఇంగ్లండ్ 82 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ పరాజయంతో స్టోక్స్–మెకల్లమ్ జోడీ రూపొందించిన దూకుడు ‘బాజ్‌బాల్’ విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై 2010-11 తర్వాత ఒక్క సిరీస్ కూడా గెలవలేకపోవడం ఇంగ్లండ్‌కు పెద్ద మైనస్‌గా మారింది. పరువు దక్కించుకునే ప్రయత్నంలో మిగిలిన టెస్టులకు ఇంగ్లండ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఇక చూడాల్సింది ఒక్కటే.. ఆషెస్ వైఫల్యం తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ నిజంగానే ‘బాజ్‌బాల్’ నుంచి బయటికి వచ్చి, రవి శాస్త్రి లాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే కోచ్ వైపు అడుగులు వేస్తుందా లేదా అనేది.


