హనియె హత్య.. గంట ముందు గడ్కరీతో భేటీ..!
ప్రధాని మోదీ తరఫున ఇరాన్‌కు నితిన్ గడ్కరీ
ప్రమాణ స్వీకార వేడుకలో హనియెను ప్రత్యక్షంగా చూసిన మంత్రి
తెల్లవారుజామునే హనియో హత్య వార్త… షాక్‌కు గురైన గడ్కరీ
సంచలన విషయాలు బయటపెట్టిన కేంద్ర మంత్రి గడ్కరీ
కాకతీయ, నేషనల్ డెస్క్ : హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనియె హత్యకు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి. హనియె హత్యకు కేవలం కొన్ని గంటల ముందు తాను అతడిని ప్రత్యక్షంగా కలిసినట్లు గడ్కరీ వెల్లడించారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రమాణ స్వీకారానికి భారత ప్రతినిధిగా తాను తెహ్రాన్‌కు వెళ్లినట్లు గడ్కరీ తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఫైవ్‌స్టార్ హోటల్‌లో జరిగిన అనౌపచారిక సమావేశంలో అనేక దేశాల అధినేతలతో పాటు హనియె కూడా ఉన్నాడని చెప్పారు. రాష్ట్రాధినేత కాకపోయినా, హనియె అధ్యక్షుడు, చీఫ్ జస్టిస్‌తో కలిసి కార్యక్రమానికి వెళ్లడాన్ని తాను గమనించినట్లు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం హోటల్‌కు తిరిగి వచ్చిన తనకు, జూలై 31 తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారతదేశానికి చెందిన ఇరాన్ రాయబారి వచ్చి వెంటనే అక్కడి నుంచి వెళ్లాలని చెప్పారని గడ్కరీ వివరించారు. అప్పుడే హమాస్ చీఫ్ హనియె హత్యకు గురైనట్లు సమాచారం అందిందని, ఇది తనకు తీవ్ర షాక్ ఇచ్చిందన్నారు.
హత్య ఎలా జరిగిందనే ఇప్పటికీ స్పష్టత లేదు..
ఇరాన్ అధికారుల ప్రకారం, అత్యంత భద్రత కలిగిన ఐఆర్‌జీసీ ఆధీనంలోని సైనిక సముదాయంలో హనియెపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన బాడీగార్డ్ కూడా మృతి చెందాడు. హత్య ఎలా జరిగిందనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదని గడ్కరీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మోసాద్ పాత్రపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పేలుడు పదార్థాల ద్వారా దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఇరాన్ భద్రతా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ… “దేశం బలంగా ఉంటే ఎవరూ దానిపై చేయి వేయలేరు” అంటూ ఇజ్రాయెల్‌ను ఉదాహరణగా ప్రస్తావించడం మరో చర్చకు దారి తీసింది.


