యూరియా కోసం రైతుల పడిగాపులు
కాకతీయ, గీసుగొండ : యాసంగి పంట కీలక దశలో ఉండగా యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. వానాకాలంలో ఎదురైన సమస్యే యాసంగిలోనూ కొనసాగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని కొనాయిమాకుల రైతు వేదికలో బుధవారం యూరియా పంపిణీ జరుగుతుందన్న సమాచారంతో రైతులు చలిని లెక్కచేయకుండా తెల్లవారుజాము మూడు గంటల నుంచే అక్కడికి చేరుకుని బారులు తీరారు. రైతు కార్డులు ఉన్నప్పటికీ ఎన్ని ఎకరాల సాగు ఉన్నా ఒక్క కార్డుకు ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇవ్వడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరానికి సరిపడ యూరియా అందకపోతే పంటలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని వాపోయారు. యూరియా పంపిణీకి వినియోగిస్తున్న యాప్ సాంకేతిక లోపాలతో సరిగా పనిచేయకపోవడం సమస్యను మరింత పెంచిందని రైతులు పేర్కొన్నారు. ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బాబు స్పందిస్తూ, యూరియా యాప్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. అందుబాటులో ఉన్న యూరియాను న్యాయంగా పంపిణీ చేస్తున్నామని, సరఫరా క్రమంగా మెరుగవుతుందని రైతులు సహనం వహించాలని ఆయన కోరారు.


