కాకతీయుల శిల్పకళా సౌందర్యం అద్భుతం
కాకతీయ, ఖిలా వరంగల్ : ఓరుగల్లు కోటలో కాకతీయుల శిల్పకళా వైభవం అద్భుతంగా ఉందని నాగర్‌కర్నూల్ జిల్లా జడ్జి నసీమా, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత కుటుంబ సభ్యులతో కలిసి ప్రశంసించారు. బుధవారం వేర్వేరు సమయాల్లో వారు కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ కోటను సందర్శించి చారిత్రక కట్టడాలను తిలకించారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ గైడ్ దేనబోయిన రవి యాదవ్, కాకతీయుల కాలంలోని శిల్పకళా సౌందర్యం, చారిత్రక ప్రాధాన్యం గురించి సందర్శకులకు వివరించారు. స్వయంభు దేవాలయంలోని కళాతోరణాలు, శిల్పాల నైపుణ్యాన్ని జిల్లా జడ్జి, డీసీపీ కుటుంబ సభ్యులు ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం ఏకశిలా కొండ, కుష్ మహల్, శృంగార బావి, రాతికోట మెట్లు తదితర చారిత్రక ప్రదేశాలను సందర్శించి కాకతీయుల నిర్మాణ శైలిని మెచ్చుకున్నారు. ఈ పర్యటనలో జిల్లా జడ్జి నసీమా వెంట వరంగల్ జ్యుడిషియల్ విభాగానికి చెందిన సిబ్బంది పాల్గొనగా, డీసీపీ కవిత వెంట మిల్స్ కాలనీ ఎస్సై శ్రావణ్‌కుమార్‌తో పాటు పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. ఓరుగల్లు కోటలోని శిల్పకళ, నిర్మాణ వైభవం నేటికీ తరతరాలకు ఆదర్శంగా నిలుస్తోందని వారు వ్యాఖ్యానించారు.


