భద్రకాళి అమ్మవారి ఊరేగింపునకు నూతన రథం
కాకతీయ, వరంగల్ సిటీ: వరంగల్ మహానగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవస్థానంలో అమ్మవారి ఊరేగింపుల కోసం నూతనంగా రథం తయారీపై చర్యలు చేపట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి వల్లినాయగం నేతృత్వంలో ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈఓ, అర్చకులతో సమావేశం నిర్వహించి రథ నమూనాలను పరిశీలించారు. 30, 40, 50 అడుగుల ఎత్తుతో శాశ్వతంగా ఉండేలా, భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రథ నిర్మాణంపై సూచనలు, సలహాలు ఇచ్చారు. త్వరలో ప్లాన్లు, అంచనాలు సమర్పిస్తామని స్థపతి వల్లినాయగం తెలిపారు. అవి అందిన అనంతరం ఎమ్మెల్యే అధ్యక్షతన సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆలయ చైర్మన్, ధర్మకర్తల మండలి వెల్లడించింది. ఈ సందర్భంగా స్థపతి వల్లినాయగంను ఆలయ చైర్మన్, ధర్మకర్తలు శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. సమావేశంలో ఆలయ చైర్మన్ డా. బి. శివనుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు, ఈఓ రామల నునీత, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


