వైభవంగా పగిడిద్దరాజు–గోవిందరాజుల ప్రతిష్ఠాపన
ఆదివాసీ సంప్రదాయాల ప్రకారమే పునరుద్ధరణ పనులు
భక్తులకు సులభ దర్శనమే లక్ష్యం: మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం మహాజాతర అభివృద్ధి పనుల్లో భాగంగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలపై నూతనంగా ప్రతిష్ఠాపన కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివాసీ సంప్రదాయాలు, పూజారుల ఆచారాలు, పూర్వికుల ఆదేశాల ప్రకారమే గద్దెల తరలింపు, ప్రతిష్ఠాపన చేపట్టామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క తెలిపారు. ఎస్.ఎస్. తాడ్వాయి మండలంలోని మేడారంలో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మ జాతర అభివృద్ధి పనుల్లో భాగంగా భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యం కల్పించేందుకు గద్దెలను ఒకే వరుసలో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆదివాసీ డోలు చప్పుళ్లు, సంప్రదాయ నృత్యాల నడుమ పూజారుల సంస్కృతి పద్ధతిలో ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు.

రిజనులకు పసుపుతో అనుబంధం..!
పునరుద్ధరణ పనులు ప్రారంభించే ముందు గిరిజన పూజారులు, పెద్దలతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. వన దేవతల గద్దెలు ఒకే లైన్లో ఉండడం వల్ల భక్తులకు దర్శనం మరింత సులభతరంగా మారుతుందని పేర్కొన్నారు. ఇది జాతర అభివృద్ధి పనుల్లో తొలి ఘట్టమని, మిగిలిన పనులన్నీ కూడా నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పూర్వకాలంలో గిరిజనులకు పసుపుతో అనుబంధం ఎంతో బలంగా ఉండేదని, పసుపులోని ఔషధ గుణాల వల్ల అప్పట్లో అనేక వ్యాధులకు నివారణగా ఉపయోగించుకునేవారని మంత్రి వివరించారు. సమ్మక్క తల్లి గోత్రబంధం, ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రతి కార్యక్రమం కుడి నుంచి ఎడమవైపు సాగుతుందని, ప్రకృతి సిద్ధాంతాన్ని అనుసరించుతూ స్వస్తిక్ ఏర్పాటు చేశామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు ఒకే వరుసలో సులభంగా దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహాజాతర నిర్వహిస్తామని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం సర్పంచ్ పిరిల భారతీ వెంకన్న, ఆదివాసీ పూజారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



