ఆలయాల జోలికి వస్తే సహించేది లేదు
మైసమ్మ ఆలయ కూల్చివేతపై బీజేపీ ఆగ్రహం
అధికారుల తీరుపై చర్యలు తీసుకోవాలి: గంట రవికుమార్
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ జిల్లాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హెచ్చరించారు. పైడిపెల్లిలో మైసమ్మ ఆలయాన్ని కూల్చివేసిన ఘటనపై ఆయన బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం మైసమ్మ ఆలయాన్ని పరిశీలించిన గంట రవికుమార్, స్థానిక గ్రామస్తులు, భక్తులతో మాట్లాడి ఆలయాన్ని తిరిగి నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆలయ కూల్చివేతలో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, కార్పొరేషన్ నిధులతోనే ఆలయాన్ని పునఃనిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రక ఓరుగల్లు నగరంలో అనేక అక్రమ నిర్మాణాలు, నాలా కబ్జాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోని అధికారులు హిందూ దేవాలయాల విషయంలో మాత్రమే కఠినంగా వ్యవహరించడం అన్యాయమని విమర్శించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై
రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై పోలీసుల సహాయంతో ఆలయాన్ని కూల్చివేశారని ఆరోపించారు. రోడ్డుపక్కన ఉన్నా, లేఅవుట్ పరిధిలో ఉన్నా కుట్రపూరితంగా ఆలయాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఓరుగల్లులో హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని స్పష్టం చేశారు. ఒక మతానికి మొగ్గు చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలను ప్రోత్సహించకూడదని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
అక్రమ నిర్మాణాలు కనిపించవా?
గ్రేటర్ వరంగల్ పరిధిలో రోజుకో అక్రమ నిర్మాణం పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని, నాలాల కబ్జాలు, రోడ్లపై నిర్మాణాలు జరుగుతున్నా అవి కార్పొరేషన్ అధికారులకు కనిపించడం లేదా అంటూ గంట రవికుమార్ ప్రశ్నించారు. హిందూ దేవాలయాలే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారా అని మండిపడ్డారు. అధికారులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోకపోతే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, హిందూ బంధువులు, పైడిపెల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.


