భారత్ పర్యటనకు న్యూజిలాండ్ జట్ల ప్రకటన
వన్డేలకు బ్రేస్‌వెల్, టీ20లకు సాంట్నర్ కెప్టెన్లు
కాకతీయ, స్పోర్ట్స్ : భారత్ పర్యటనకు సంబంధించిన వన్డే, టీ20 అంతర్జాతీయ జట్లను న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. టీ20 జట్టుకు మిచెల్ సాంట్నర్‌ను, వన్డే సిరీస్‌కు మైకేల్ బ్రేస్‌వెల్‌ను కెప్టెన్లుగా నియమించింది. భారత్‌లో వచ్చే నెల జరిగే ఈ పర్యటనలో బ్లాక్‌క్యాప్స్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. గాయాల నుంచి కోలుకున్న కైల్ జేమిసన్ రెండు ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. టీ20 జట్టులో మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ తిరిగి ఎంపిక కావడం విశేషం. మరోవైపు సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్కు విశ్రాంతినివ్వగా, జేకబ్ డఫీ, రాచిన్ రవీంద్ర గాయాల కారణంగా ఈ పర్యటనకు దూరమయ్యారు. ఈ ఎంపికల్లో యువతకు అవకాశం కల్పించడమే లక్ష్యంగా న్యూజిలాండ్ సెలెక్టర్లు అడుగులు వేశారు. లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్ జేడెన్ లెనాక్స్కు తొలిసారి అంతర్జాతీయ పిలుపు లభించింది. అలాగే వన్డే జట్టులో క్రిస్టియన్ క్లార్క్‌కు అవకాశం ఇవ్వడం గమనార్హం.
షెడ్యూల్ ఇలా…
వన్డే సిరీస్ జనవరి 11న వడోదరలో ప్రారంభమవుతుంది. రెండో వన్డే జనవరి 14న రాజ్‌కోట్‌లో, మూడో వన్డే జనవరి 18న ఇండోర్‌లో జరుగుతుంది. అనంతరం జనవరి 21 నుంచి నాగ్‌పూర్‌లో టీ20 సిరీస్ మొదలవుతుంది. భారత్, శ్రీలంకల్లో 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ దృష్ట్యా ఈ టీ20 సిరీస్ రెండు జట్లకూ కీలకంగా మారనుంది. ప్రపంచకప్ ముందు జట్టు కలయికలు, యువ ఆటగాళ్ల పనితీరును పరీక్షించుకునే వేదికగా ఈ సిరీస్ ఉండనుంది.


