ఇరవై ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరుల ఐక్యత
మున్సిపల్ ఎన్నికల్లో శివసేన–ఎంఎన్‌ఎస్ కూటమి
కాకతీయ, నేషనల్ డెస్క్ : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా రాజకీయంగా దూరంగా కొనసాగుతున్న ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ ఒక్కటయ్యారు. పరస్పర విభేదాలకు ముగింపు పలుకుతూ, కలిసి రాజకీయంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో శివసేన (ఉద్ధవ్ వర్గం), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) కూటమిగా పోటీ చేయనున్నట్లు వారు ప్రకటించారు. ఇరువురు నేతలు కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తమకు ప్రధానమని, గతంలోని విభేదాలను పక్కన పెట్టి రాజకీయ సమన్వయంతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేచినట్లయింది.
విభేదాలకు తెర… సమన్వయానికి ఆరంభం
బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వం, పార్టీ నియంత్రణ అంశాలపై గతంలో ఉద్ధవ్, రాజ్ మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో రాజ్ ఠాక్రే శివసేన నుంచి బయటకు వచ్చి ఎంఎన్‌ఎస్‌ను స్థాపించారు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరు రాజకీయ దారుల్లో సాగారు. అయితే మారుతున్న రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల ప్రాధాన్యత దృష్ట్యా మళ్లీ కలసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ కూటమి ఏర్పాటైంది. ముంబయిపై పట్టును నిలుపుకోవడమే లక్ష్యంగా శివసేన–ఎంఎన్‌ఎస్ కలిసి వ్యూహాలు రచిస్తున్నాయి. మరాఠీ ఓటర్లను ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ ఐక్యత వెనుక ప్రధాన ఉద్దేశమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రాజకీయ వర్గాల్లో ఆసక్తి
ఠాక్రే సోదరుల ఐక్యతతో మహారాష్ట్ర రాజకీయాల్లో బలమైన సంకేతం వెలువడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీకి ఇది సవాలుగా మారవచ్చని, అలాగే కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీల వ్యూహాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.
భవిష్యత్ దిశపై ఉత్కంఠ
శివసేన–ఎంఎన్‌ఎస్ కూటమి ఎంతవరకు ప్రజాదరణ పొందగలుగుతుందన్నది రానున్న ఎన్నికల ఫలితాలతో తేలనుంది. అయితే ఇరవై ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు కలవడం మాత్రం మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ కీలక అధ్యాయంగా నిలవనుంది.


