డీజీపీ నియామకం రద్దుకు హైకోర్టు నిరాకరణ
రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్‌ను యూపీఎస్‌సీకి పంపాలన్న ఆదేశం
సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారమే ప్యానెల్ ఉండాలని ఆదేశాలు
ప్యానెల్ పంపిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టీకరణ
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ డీజీపీగా శివధర్‌రెడ్డి నియామక ఉత్తర్వులను రద్దు చేయాలన్న అభ్యర్థనకు హైకోర్టు నిరాకరించింది. అయితే, డీజీపీ ఎంపిక ప్రక్రియపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
డీజీపీ నియామక ప్రక్రియ సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే జరగాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్యానెల్ లిస్టులో అర్హత కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను మాత్రమే పొందుపరచాలని పేర్కొంది. ఎలాంటి మినహాయింపులకు అవకాశం లేదని వ్యాఖ్యానించింది.
ప్యానెల్ పంపిన తర్వాతే కౌంటర్
డీజీపీల ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపిన అనంతరం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, నిబంధనల పాటన తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను వచ్చే నెల 20వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అప్పటికి ప్యానెల్ పంపిన వివరాలు, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే కౌంటర్ ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


