పెన్ డ్రైవ్‌పై సిట్ ఫోకస్
ఫోన్ టాపింగ్ కేసులో కీలక ఆధారం
వందల ఫోన్ నంబర్లు, పూర్తి ప్రొఫైల్స్ లభ్యం
రాజకీయ నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల వివరాలు ఉన్నట్లు గుర్తింపు
ప్రభాకర్ రావును ముందుంచి లోతైన విచారణ
కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం
కాకతీయ, హైదరాబాద్ : ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆధారంగా మారిన ఒక పెన్ డ్రైవ్‌పై ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ మొత్తం కేంద్రీకృతమైంది. ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన కీలక డేటా ఈ పెన్ డ్రైవ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో కేసు కీలక దశకు చేరుకుంది. ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావు పనిచేసిన సమయంలో ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన వివరాలను ఈ పెన్ డ్రైవ్‌లో స్టోర్ చేసినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. ఇందులో వందల సంఖ్యలో ఫోన్ నంబర్లు ఉండటంతో పాటు, ఆయా నంబర్లకు సంబంధించిన పూర్తి ప్రొఫైల్స్‌ను కూడా భద్రపరిచినట్టు అధికారులు గుర్తించారు.
ప్రముఖుల వివరాలు కూడా…
ఈ పెన్ డ్రైవ్‌లో రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, అలాగే హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్ నంబర్లు, ప్రొఫైల్స్ ఉన్నట్లు సిట్‌కు స్పష్టమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ డేటా ఆధారంగానే ఎవరి ఫోన్లు టాపింగ్‌కు గురయ్యాయన్న విషయాన్ని సిట్ గుర్తించినట్టు సమాచారం.
ప్రస్తుతం ఈ పెన్ డ్రైవ్‌లోని సమాచారాన్ని ప్రభాకర్ రావు ముందుంచి సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఫోన్ టాపింగ్ ఎలా జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు డేటా సేకరించబడిందన్న అంశాలపై లోతైన ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం. టాపింగ్ పరిధి, లక్ష్యాలు, వినియోగించిన సాంకేతిక పద్ధతులపై కూడా సిట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
నాశనం చేసిన ఆధారాలు… మిగిలిన పెన్ డ్రైవ్
ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన అనేక ఆధారాలను ప్రభాకర్ రావు టీమ్ నాశనం చేసినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, ఈ పెన్ డ్రైవ్‌ను సిట్ స్వాధీనం చేసుకోవడం కేసులో కీలక పరిణామంగా మారింది. కేసును నిరూపించేందుకు ఇది బలమైన సాక్ష్యంగా ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ పెన్ డ్రైవ్ ఆధారంగా ప్రభాకర్ రావును మూడు రోజుల పాటు విచారించి పూర్తి వివరాలు, స్పష్టమైన వివరణలు సేకరించేందుకు సిట్ సిద్ధమైంది. ఈ విచారణలో ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.


