బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు
ఢిల్లీ బంగ్లా హైకమిషనర్‌కు సమన్లు
“ఎన్నికలను అస్థిరపర్చేందుకే అన్నను చంపేశారు” – ఒమర్ హాదీ
కాకతీయ, నేషనల్ డెస్క్ : బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాల చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక దౌత్య చర్యకు దిగింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషనర్‌ను కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసి వివరణ కోరింది. మైనారిటీల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బంగ్లా ప్రభుత్వ వైఖరిని ఖండించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం, మైనారిటీల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేయడం ద్వారా భారత్ తన ఆందోళనను అధికారికంగా తెలియజేసింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే మరిన్ని దౌత్య చర్యలు తీసుకుంటామని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి.
షేక్ హసీనా ప్రభుత్వ పతనంలో హాదీ కీలక పాత్ర
ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న ఉస్మాన్ హాదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వం ఉందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాదీ సోదరుడు ఒమర్ హాదీ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే తన అన్నను హత్య చేశారని ఆరోపించారు. ఎన్నికలను అస్థిరపర్చాలనే ఉద్దేశంతోనే ఈ హత్యకు పాల్పడ్డారని అన్నారు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడంలో ఉస్మాన్ హాదీ కీలక పాత్ర పోషించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే కారణంగా ఆయనను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఈ నెల 12న హాదీపై కాల్పులు జరగగా, తీవ్రంగా గాయపడిన ఆయన ఈ నెల 18న మృతి చెందారు. హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా హిందూ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయాలు, ఇళ్లు, వ్యాపారాలపై దాడులు జరిగినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూ, భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతోంది.


