“నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే”
జీహెచ్ఏంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేస్తా
ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు
ఫిరాయింపు ఆరోపణలపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
కాకతీయ, హైదరాబాద్ : ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సీనియర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఫిరాయింపు ఆరోపణలను పరోక్షంగా ఖండిస్తూ తన పార్టీపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని దానం నాగేందర్ వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. స్పీకర్ ముందు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అర్థం ఏమిటన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టంగా ప్రకటించడం ద్వారా తన స్థానం మార్చుకోలేదన్న సంకేతం ఇచ్చారు.

జీహెచ్ఏంసీ ఎన్నికలపై ఫోకస్
రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఏంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామని దానం నాగేందర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 300 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తానని వెల్లడించారు. అవసరమైతే ఎంఐఎం పార్టీ అభ్యర్థులకు కూడా మద్దతుగా ప్రచారం చేస్తానని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ పార్టీకే అంకితమని దానం నాగేందర్ చెప్పారు. పార్టీపై విశ్వాసంతోనే ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తానని, జీహెచ్ఏంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఫిరాయింపు అంశంపై జరుగుతున్న ప్రచారాన్ని రాజకీయంగా ఎదుర్కొంటామని, ప్రజల్లో వాస్తవాలు స్పష్టంగా ఉంచుతామని తెలిపారు.
రాజకీయ వర్గాల్లో చర్చ
దానం నాగేందర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ మొదలైంది. స్పీకర్ విచారణ తుది దశకు చేరుతున్న వేళ దానం చేసిన ప్రకటనలు భవిష్యత్ రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


