ఆనందంగా వసూళ్ల దందా
స్లాట్ లేకుండానే రిజిస్ట్రేషన్లు
నాన్‌స్లాట్ రిజిస్ట్రేషన్ల ద్వారా పెద్ద ఎత్తున అక్రమార్జన
డాక్యుమెంట్ రైటర్లతో వసూళ్ల పర్వం
ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తున్న కీలక అధికారి
హన్మకొండ జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ఇష్టారాజ్యం
అక్రమ వసూళ్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు

కాకతీయ, వరంగల్ బ్యూరో : హన్మకొండ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో ఓ కీలక అధికారి అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూములు, ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన ప్రక్రియలో నిబంధనలకు తిలోదకాలిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొందరు డాక్యుమెంట్ రైటర్లను మధ్య వర్తులుగా ఏర్పాటుచేసుకొని ఆస్తుల రేట్ల ఆధారంగా యథేచ్చగా వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కార్యాలయంలో ఏ పని జరగాలన్నా ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని, నేరుగా వెళితే పనులు జరగడంలేదని బాధితులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

డాక్యుమెంట్ రైటర్స్ హవా..
హనుమకొండలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాదాపు 70 డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలుండగా.. అందులో 250 మందికిపైగా డాక్యుమెంట్ రైటర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటోందన్న ఆరోపణలున్నాయి. అధికారులకు సన్నిహితంగా ఉంటూ క్రయవిక్రయాల్లో కీలకపాత్ర పోషించి ఫీజు టూ ఫీజు పేరిట వసూళ్లు చేస్తున్నారు. అధికారులు తమ వద్దకు వచ్చిన ప్రతీ డాక్యుమెంట్‌ను పరిశీలించి అది ఏ రైటర్ నుంచి వచ్చిందో నోట్ చేసుకుని సాయంత్రం వసూళ్లు చేస్తారని సమాచారం. వారు ప్రత్యేకంగా నియమించుకున్న ప్రైవేటు వ్యక్తి సాయంత్రం డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లి ఆయన పరిధిలో చేసిన డాక్యుమెంట్ల సంఖ్య ఆధారంగా వసూలు చేస్తాడని తెలిసింది. ప్రతీ డాక్యుమెంట్‌కు రూ.3 వేల చొప్పున, ఏదైనా సమస్య ఉంటే అదనంగా తీసుకుంటారన్నది బహిరంగ సత్యమేన్న అభిప్రాయాలున్నాయి. కొంతమంది డాక్యుమెంట్ రైటర్లయితే అత్యాశతో అధికారులను ప్రలోభాలకు గురిచేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి పట్టుబడిన సంఘటనలున్నాయి. ఇదిలాఉంటే కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు విచ్చలవిడిగా సంపాదించి ప్రజాప్రతినిధులకు సన్నిహితంగా ఉంటూ అధికారులపై పెత్తనం చేసే స్థాయికి చేరుకున్నారంటే వారి హవా ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.

స్లాట్ లేకుండానే రిజిస్ట్రేషన్..
వాస్తవానికి స్లాట్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధన పెట్టింది ప్రభుత్వం. క్రయవిక్రయదారులు ముందస్తుగా స్లాట్‌బుక్ చేసుకుంటే తేదీ, సమయం వస్తుంది. దీని ఆధారంగా క్రయ విక్రయదారులు కార్యాలయం చేరుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కార్యాలయాల్లో దీనికి భిన్నంగా జరుగుతోంది. జిల్లా కార్యాలయంలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ అధికారులు ఉండగా, ఒక్కో సబ్ రిజిస్ట్రార్ రోజుకు సుమారు 45 స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్లు చేస్తారని సమాచారం. ఇంతకు మించి స్లాట్ బుకింగ్ ఉండదు. ఇద్దరు 90 రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉండగా ఇదంతా మధ్యవర్తులతోనే జరుగుతోందన్న విమర్శలున్నాయి. స్లాట్ బుక్ చేసుకోకుండా నేరుగా వచ్చే క్రయవిక్రయదారుల వద్ద ఇష్టం వచ్చినంత వసూలు చేసి తతంగం పూర్తి చేస్తారనే ఆరోపణలున్నాయి. నాన్ స్లాట్ రిజిస్ట్రేషన్లు చేస్తే సబ్ రిజిస్టర్ కు కూడా ఆదాయం వస్తుండటంతో కార్యాలయ సమయం పూర్తయినా లెక్కచేయకుండా రిజిస్ట్రేషన్లు చేస్తారని తెలిసింది. స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ల కంటే నాన్‌స్లాట్ రిజిస్ట్రేషన్ల ద్వారానే పెద్ద ఎత్తున ముడుపులు అందుతాయనే ప్రచారం ఉంది.
దృష్టి సారించని ఉన్నతాధికారులు..
హన్మకొండ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కీలక అధికారులు పెద్ద ఎత్తున దందా కొనసాగిస్తున్నారనే సమాచారం ఉన్నా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఉన్నతాధికారులు అంతగా స్పందించడం లేదనే విమర్శలున్నాయి. మీడియాలో వార్తలు వచ్చినప్పుడు నామమాత్రపు తనిఖీలు చేసే అధికారులు మిగతా రోజుల్లో కార్యాలయాలవైపు కన్నెత్తి చూడరనే ఆరోపణలున్నాయి. కొన్ని సందర్బాల్లో అవకతవకలకు పాల్పడే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు పెండింగ్ విచారణ పేరుతో కోరుకున్న స్థానాల్లో పునర్నియామకం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఆరోపణలతో వేటు పడిన కొందరు ఉద్యోగులు పెండింగ్ విచారణ పేరిట ఆదాయం ఉండే స్థానాల్లో పోస్టింగ్ తీసుకుని కొనసాగుతుండటం గమనార్హం.


