కాజీపేట కొత్త ఆర్వోబీ పూర్తయ్యేదెన్నడు..?
70 శాతం పూర్తి.. గర్డర్ల అమరికే ప్రధాన అడ్డంకి
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ముందుకు సాగని పనులు
కాకతీయ, హన్మకొండ : కాజీపేటలో నిర్మాణంలో ఉన్న కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు సుమారు 70 శాతం వరకు పూర్తయ్యాయి. రైల్వే పట్టాలకు ఇరువైపులా వంతెన నిర్మాణం దాదాపు ముగింపు దశకు చేరింది. అయితే అత్యంత కీలకమైన పట్టాలపై గర్డర్లను అమర్చే పనులు గత ఏడాది కాలంగా వివిధ కారణాలతో నిలిచిపోయాయి. భిలాయ్ ఉక్కు కర్మాగారం నుంచి అవసరమైన గర్డర్లు ఇప్పటికే కాజీపేటకు చేరుకున్నప్పటికీ, వాటి అమరికలో గుత్తేదారు జాప్యం చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాదు, ఢిల్లీ–చెన్నై గ్రాండ్ ట్రంక్ ప్రధాన రైలు మార్గం కావడంతో పట్టాలపై పనుల నిర్వహణకు రైల్వే, ఆర్అండ్బీ అధికారుల మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాల్సి రావడం కూడా ఆలస్యానికి కారణమవుతోంది.
ఎప్పటికీ పూర్తయ్యేను..!
అక్టోబర్ 2025 నాటి సమాచారం ప్రకారం, వంతెన ఆర్క్ నిర్మాణాలకు సంబంధించిన వెల్డింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. పనుల్లో వేగం పెంచేందుకు అదనపు నిపుణులను రప్పించినట్లు అధికారులు వెల్లడించారు. పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో పాటు దానిపై భారీ గుంతలు ఏర్పడటంతో నిత్యం తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్–హనుమకొండ ప్రధాన రహదారిపై ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొత్త ఆర్వోబీ పూర్తయితేనే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ పెరగడంతో పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి వంతెనను అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.


