ప్రమాదాలను నివారించాలి
బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు తప్పనిసరి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో గతంలో గుర్తించిన ప్రమాద ప్రాంతాలు, అక్కడ చేపట్టిన నివారణ చర్యలను సమీక్షించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వేగ నియంత్రణ చర్యలు అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి శాశ్వత పరిష్కారాలు చేపట్టాలన్నారు. నేషనల్ హైవే అథారిటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు చర్చించిన అంశాలపై వెంటనే చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో ఫస్ట్‌ఎయిడ్ కిట్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని తెలిపారు.
రోడ్డు భద్రతా మాసోత్సవాలు
జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించాలని, అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ వివరాలను వెల్లడించారు. కరీంనగర్–జగిత్యాల రహదారిపై చెట్ల కొమ్మలు రాత్రివేళల్లో ప్రమాదాలకు కారణమవుతున్నాయని పేర్కొని, తక్షణమే తొలగించాలని సూచించారు.


