తనుగుల చెక్‌డ్యామ్‌ను పేల్చేశారు
ప్రకృతి వైపరీత్యంగా చిత్రీకరించే యత్నం చేశారు
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కాదు.. మాఫియా పాలనే
సోషల్‌మీడియా వేదికగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం కాదని, పూర్తిస్థాయిలో ‘మాఫియా పాలన’ కొనసాగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలు హద్దులు దాటాయని, అధికారుల అండదండలతోనే ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లాలోని తనుగుల చెక్‌డ్యామ్‌ను ఇసుక మాఫియా పేల్చివేసిన ఘటనపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ఘటనను ప్రకృతి వైపరీత్యంగా చిత్రీకరించడాన్ని ఆయన ఖండించారు. ‘వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్ర సింగ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఇది సహజ ఘటన కాదని, ఇసుక అక్రమ తవ్వకాల కోసం ఉద్దేశపూర్వకంగా చేసిన మానవ నిర్మిత విధ్వంసమని పేర్కొన్నారు. చెక్‌డ్యామ్‌ను ధ్వంసం చేయడం ద్వారా నీటి వనరులను నాశనం చేయడమే కాకుండా భూగర్భ జలాలకు తీవ్ర నష్టం కలుగుతోందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించేందుకే ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియా వెనుక రాజకీయ రక్షణ, అధికార యంత్రాంగం మౌన సమ్మతి స్పష్టంగా కనిపిస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఇలాంటి అక్రమాలను అడ్డుకోలేని ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందన్నారు. చెక్‌డ్యామ్ విధ్వంసానికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


