ఇష్టారాజ్యంగా ఇటుక దందా!
పెద్దపల్లి జిల్లాలో 200కు పైగా ఇటుక బట్టీల కేంద్రాలు
సగానికి పైగా బట్టీల్లో నిబంధనల ఉల్లంఘన
వ్యవసాయ విద్యుత్ వ్యాపారానికి వినియోగం
చూస్తూ ఊరుకుంటున్న విద్యుత్ శాఖ
బట్టీల్లో బాల కార్మికులు – మౌనంగా కార్మిక శాఖ
అక్రమాలకు అండగా పోలీస్, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖల అధికారులు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి జిల్లా కేంద్రం శివారుల్లో అక్రమ ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పెద్దపల్లి, గోదావరిఖని, రామగుండం, మంతని ప్రాంతాల్లో నిర్మాణాలు జోరుగా సాగుతుండటంతో ఇటుకలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు నిర్వాహకులు ఎలాంటి అనుమతులు లేకుండానే ఇటుక బట్టీలను దర్జాగా నిర్వహిస్తున్నారు.జిల్లాలో కొనసాగుతున్న ఇటుక బట్టీల్లో మెజార్టీ నిబంధనల ఊసే లేకుండా నడుస్తున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వ్యాపారులు ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం. అనుమతులు, లైసెన్సులు లేకుండా బట్టీలు కొనసాగుతుండగా, వ్యవసాయానికి కేటాయించిన ఉచిత విద్యుత్‌ను వ్యాపారానికి వినియోగిస్తున్నారు. విషయం తెలిసినా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
200కు పైగా ఇటుక బట్టీలు… లెక్కలే లేవు!
ఒక అంచనా ప్రకారం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్ద స్థాయిలో ఇటుకలను ఉత్పత్తి చేస్తున్న ఇటుక బట్టీలు 200కు పైగా ఉన్నాయి. వీటితో పాటు చిన్న స్థాయిలో కొనసాగుతున్న బట్టీలు వందల్లో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. చాలా బట్టీలు గ్రామ పంచాయతీ, గనులు, కాలుష్య నియంత్రణ శాఖ అనుమతులు లేకుండానే పనిచేస్తున్నట్లు సమాచారం. సీజనల్‌గా బట్టీలు ఏర్పాటు చేసి అధికారుల కంటపడకుండా దందా సాగుతున్న వైనం అనేక అనుమానాలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అసలు ఎన్ని ఇటుక బట్టీలు ఉన్నాయనే స్పష్టమైన లెక్కలు అధికారికంగా లేకపోవడం పర్యవేక్షణ లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
నిబంధనలు ఇలా… వాస్తవం ఇలా…
నిబంధనల ప్రకారం ఇటుక బట్టీలు ఏర్పాటు చేయాలంటే గ్రామ పంచాయతీ, గనులు & భూగర్భ శాస్త్ర శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు తప్పనిసరి. నివాస ప్రాంతాలకు కిలోమీటరు దూరం, పంట పొలాలకు 100 మీటర్లు, ప్రధాన రహదారులకు 200 మీటర్ల దూరం పాటించాలి. కానీ జిల్లాలో కొనసాగుతున్న బట్టీల్లో ఈ నిబంధనలేవీ అమలవడం లేదు. చెరువులు, వాగులు, ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మట్టిని తోడేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటుకలు కాల్చేందుకు అనుమతి లేని ఇంధనం వినియోగిస్తున్నారని, సింగరేణి బొగ్గు అక్రమంగా బట్టీలకు చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్, పోలీస్ శాఖలకు చెందిన కొందరు అధికారులు ముడుపులు తీసుకుంటూ అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇటుక బట్టీల మధ్య బాల్యం
జిల్లా వ్యాప్తంగా ఇటుక బట్టీల్లో బిహార్, ఒడిశా, యూపీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు కుటుంబాలతో నివసిస్తున్నారు. వీరి పిల్లలు పాఠశాలల బాట తప్పి ఇటుక బట్టీల్లోనే పనులకు దిగుతున్నారు. ఒక అంచనా ప్రకారం సుమారు 8 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా, వెయ్యికి పైగా బాల కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. బాల కార్మిక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా కార్మిక శాఖ కన్నెత్తి చూడకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
కనీస వసతులు లేకపోవడం, గుడిసెల్లో జీవనం, వైద్య సదుపాయాల లేమి, వేతనాల దోపిడీ వంటి సమస్యలు వలస కార్మికుల జీవితాలను నరకప్రాయంగా మారుస్తున్నాయి. గతంలో ఇటుక బట్టీల్లో లైంగిక దాడుల ఘటనలు నమోదైనా పరిస్థితి మారలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమ ఇటుక బట్టీలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


