ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం
నకిలీ యాప్‌లు, లాభాల ఆశ చూపి వల
వృద్ధుడు నుంచి రూ.1.32 కోట్లు స్వాహా
కేసు నమోదు చేసిన పుణే పోలీసులు
కాకతీయ, నేషనల్ డెస్క్ : ఆన్‌లైన్ మోసాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట పుణేలో ఓ వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.32 కోట్లను కాజేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అధిక లాభాలు వస్తాయంటూ సైబర్ నేరగాళ్లు బాధితుడిని సంప్రదించారు. షేర్ మార్కెట్, క్రిప్టో పెట్టుబడుల పేరుతో నకిలీ యాప్‌లు, వెబ్ లింకులు పంపించి నమ్మించారు. మొదట చిన్న మొత్తాలపై లాభాలు చూపించి విశ్వాసం పెంచిన వారు.. అనంతరం పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెట్టారు. నమ్మిన బాధితుడు దశలవారీగా బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులు జమ చేయగా, మొత్తం రూ.1.32 కోట్ల వరకు మోసగాళ్లు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత లాభాలు రావడం ఆగిపోవడంతో అనుమానం వచ్చి పరిశీలించగా మోసం జరిగినట్లు బాధితుడు గుర్తించారు. సైబర్ మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అధిక లాభాల హామీలను నమ్మవద్దని, తెలియని లింకులు, యాప్‌లకు స్పందించకూడదని హెచ్చరించారు. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.


