జూడోలో గురుకుల బాలికల సత్తా
ఎస్‌జీఎఫ్‌ఐ పోటీల్లో 2 బంగారు, 2 కాంస్య పతకాలు
జాతీయ పోటీలకు మడికొండ గురుకుల విద్యార్థినుల ఎంపిక
కాకతీయ, కాజీపేట : కఆజీ కాజీపేట మండలం మడికొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన జూడో అకాడమీ విద్యార్థినులు రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించిన 69వ ఎస్‌జీఎఫ్‌ఐ అంతర్ జిల్లా – రాష్ట్రస్థాయి అండర్–14 జూడో ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న మడికొండ గురుకుల బాలికలు మొత్తం 2 బంగారు, 2 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. ఎం.డి. తహనీయత్ – 32 కేజీల విభాగంలో, కె. సహజ – 44 కేజీల విభాగంలో ప్రత్యర్థులను ఓడించి బంగారు పతకాలు సాధించారు. కె. వెన్నెల – 27 కేజీల విభాగం, ఆర్. మధుప్రియ – 36 కేజీల విభాగంలో కాంస్య పతకాలు గెలిచారు.
జాతీయ పోటీలకు ఎంపిక
బంగారు పతకాలు సాధించిన తహనీయత్, సహజ విద్యార్థినులు జనవరి 6 నుంచి 11వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో జరగనున్న 69వ ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయ జూడో ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక కావడం ఎంతో ఆనందకరమని మడికొండ గురుకుల ప్రధానోపాధ్యాయురాలు, హన్మకొండ జిల్లా సమన్వయ అధికారి శ్రీమతి డి. ఉమా మహేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థినులను, వారికి శిక్షణ అందించిన జూడో కోచ్ నాగరాజు, పీడీ జి. పద్మ, పీఈటీ జే. సరితలను ప్రిన్సిపల్‌తో పాటు గురుకుల సిబ్బంది అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో బాలికలు సాధించిన విజయాలు ఇతర విద్యార్థినులకు ప్రేరణగా నిలుస్తాయని వారు తెలిపారు.


