అమెరికా విడిచి వెళ్తే క్యాష్ + ఫ్రీ ఫ్లైట్!
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్
స్వచ్ఛందంగా వెళ్తే రూ.2.7 లక్షలు నగదు
‘సీబీపీ హోమ్’ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్
వినకపోతే అరెస్ట్, జీవితాంతం నో ఎంట్రీ
కాకతీయ, నేషనల్ డెస్క్ : అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో మిగిలితే అరెస్టులు, డిపోర్టేషన్లు.. స్వచ్ఛందంగా వెళ్తే మాత్రం నగదు, ఉచిత విమాన ప్రయాణం! ఇదే వాషింగ్టన్ నుంచి వచ్చిన స్పష్టమైన హెచ్చరిక. డిసెంబర్ 22న హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) చేసిన ప్రకటన ప్రకారం.. ఈ ఏడాది చివరిలోగా స్వచ్ఛందంగా అమెరికాను విడిచి స్వదేశాలకు తిరిగివెళ్లే అక్రమ వలసదారులకు 3,000 డాలర్లు (సుమారు రూ.2.7 లక్షలు) నగదుతో పాటు ఉచిత విమాన టికెట్‌ను అందించనుంది. గతంలో మే నెలలో 1,000 డాలర్లుగా ఉన్న ఈ ప్రోత్సాహకాన్ని క్రిస్మస్ సీజన్ సందర్భంగా మూడు రెట్లు పెంచడం గమనార్హం.
యాప్ ద్వారా నమోదు తప్పనిసరి
ఈ పథకాన్ని పొందాలంటే వలసదారులు ‘సీబీపీ హోమ్’ అనే మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన అనంతరం ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అమెరికా ప్రభుత్వమే చేపడుతుందని డీహెచ్‌ఎస్ స్పష్టం చేసింది. విమాన టికెట్ నుంచి స్వదేశానికి చేరే వరకూ పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది. ఈ పథకంలో చేరే వారికి మరో భారీ ఊరట కూడా ఉంది. అక్రమంగా అమెరికాలో నివసించినందుకు విధించిన సివిల్ జరిమానాలను పూర్తిగా రద్దు చేస్తామని డీహెచ్‌ఎస్ ప్రకటించింది. అంటే స్వచ్ఛందంగా వెళ్తే నగదు అందడమే కాకుండా లీగల్ సమస్యల నుంచి కూడా విముక్తి లభించనుంది. పండుగ సీజన్‌లో అక్రమ వలసదారులు తమకు, తమ కుటుంబాలకు ఇవ్వగల అత్యుత్తమ బహుమతి ఇదేనని డీహెచ్‌ఎస్ వ్యాఖ్యానించింది.
వినకపోతే కఠిన చర్యలు
అయితే ఈ ఆఫర్‌ను పట్టించుకోని వారిపై కఠిన చర్యలు తప్పవని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని వినియోగించుకోని వారిని గుర్తించి అరెస్ట్ చేసి దేశం నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. అలాంటి వారు తిరిగి అమెరికాలోకి అడుగుపెట్టే అవకాశం ఉండదని తేల్చిచెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 1.9 మిలియన్ల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా అమెరికాను విడిచిపోయారని ఆమె వెల్లడించారు. ఇప్పటికే వేలాది మంది ‘సీబీపీ హోమ్’ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు.


