ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ షాక్!
గేమింగ్, యూపీఐ, ట్రావెల్ అన్నింటిపైనా బాదుడే
ప్రీమియం కార్డుల రివార్డులకూ కోత
జనవరి 2026 నుంచి ఛార్జీలు అమల్లోకి
కాకతీయ, నేషనల్ డెస్క్ : ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్న లక్షలాది మందికి బ్యాంక్ భారీ షాక్ ఇచ్చింది. 2026 జనవరి నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలతో క్రెడిట్ కార్డు వాడకం మరింత ఖరీదుగా మారనుంది. ఛార్జీలు పెంచడంతో పాటు రివార్డు పాయింట్లపై కోతలు విధిస్తూ ఐసీఐసీఐ బ్యాంక్ కీలక మార్పులు ప్రకటించింది. ఈ కొత్త రూల్స్‌ను 2026 జనవరి–ఫిబ్రవరి మధ్య విడతల వారీగా అమలు చేయనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో క్రెడిట్ కార్డు ద్వారా చేసే ప్రతి లావాదేవీపై 2 శాతం అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. ఇప్పటివరకు గేమింగ్ కోసం క్రెడిట్ కార్డులను విస్తృతంగా వాడుతున్న యూజర్లకు ఇది భారీ దెబ్బగా మారనుంది.
యూపీఐ వాలెట్లలో నగదు లోడింగ్‌కూ కట్
అమెజాన్ పే, పేటీఎం వంటి యూపీఐ వాలెట్లలో నెలకు రూ.5,000 కంటే ఎక్కువ మొత్తాన్ని క్రెడిట్ కార్డు ద్వారా లోడ్ చేస్తే 1 శాతం ఛార్జీ తప్పనిసరి. దీంతో వాలెట్ లావాదేవీలపై కూడా భారం పెరగనుంది. ట్రావెలింగ్ ఖర్చులు రూ.50 వేల్ని దాటితే వాటిపై కూడా 1 శాతం అదనపు ఛార్జీ విధించనున్నారు. దీంతో ఫ్లైట్ టికెట్లు, హోటల్ బుకింగ్స్ మరింత ఖరీదవుతాయి. ఐసీఐసీఐ బ్రాంచ్‌లో క్రెడిట్ కార్డు బిల్లును నగదు రూపంలో చెల్లిస్తే ఇకపై రూ.150 అదనంగా చెల్లించాల్సిందే. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయమని బ్యాంక్ చెబుతోంది. ‘ఎమెరాల్డ్ మెటల్’ వంటి ప్రీమియం కార్డులపై కూడా బ్యాంక్ కోతలు విధించింది. ప్రభుత్వ సేవలు, ఇంధనం, రెంట్, పన్నులు, వాలెట్ లావాదేవీలపై ఇస్తున్న రివార్డు పాయింట్లను తగ్గించింది. రవాణా ఖర్చులకు నెలకు గరిష్టంగా రూ.20 వేల వరకే రివార్డులు అందనున్నాయి.
యాడ్-ఆన్ కార్డు, ఆఫర్లపై పరిమితులు
యాడ్-ఆన్ కార్డు తీసుకోవాలంటే రూ.3,500 ఫీజు తప్పనిసరి. బుక్‌మైషో ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్‌కు గత మూడు నెలల్లో కనీసం రూ.25 వేల ఖర్చు షరతు. ఇన్‌స్టంట్ ప్లాటినం కార్డు హోల్డర్లకు ఫిబ్రవరి 2026 నుంచి ఈ ఆఫర్ పూర్తిగా రద్దు. మొత్తంగా చూస్తే 2026 నుంచి ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడకం అంటే ప్రతి స్వైప్‌కు ఛార్జీ, ప్రతి లావాదేవీకి కట్ అన్నట్టుగా మారనుంది. ఇప్పటి నుంచే ఖర్చులపై నియంత్రణ పెట్టుకోకపోతే కొత్త ఏడాదిలో కార్డు యూజర్ల జేబుకు భారీ చిల్లు పడటం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


