కొలువు దీరిన కొత్త సర్పంచ్‌లు
హామీల అమలుపై సర్పంచ్‌ల స్పష్టత
కాకతీయ,ఆత్మకూరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆత్మకూరు మండలంలోని హౌస్ బూజుర్గ్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సయ్యద్ మౌల, ఉపసర్పంచ్ బొడిగె లక్ష్మి రాంబాబు, వార్డు సభ్యులతో కలిసి ప్రత్యేక అధికారుల సమక్షంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. ప్రమాణ స్వీకారం అనంతరం సర్పంచ్ సయ్యద్ మౌల మాట్లాడుతూ… ఎన్నికల్లో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చుతామని స్పష్టం చేశారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. గ్రామాభివృద్ధి ప్రభుత్వ పథకాలతో పాటు ప్రజల సహకారంతోనే సాధ్యమని పేర్కొన్న సర్పంచ్… వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పాలనలో పారదర్శకత పాటిస్తూ ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లోనూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.


