విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధతే కీలకం
వరదల సమయంలో శాఖల సమన్వయం అవసరం
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద
చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతంలో మాక్ ఎక్సర్సైజ్
వరద ముంపులో చిక్కుకున్న ప్రజలు, పశుసంపద రక్షణ
డ్రోన్, లైఫ్ బోట్లతో సహాయక చర్యలు
కాకతీయ, వరంగల్ : అకాల వర్షాలు, వరదలతో విపత్తు ఏర్పడినప్పుడు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో, వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వరద పరిస్థితులను ఎదుర్కొనే విధానంపై విస్తృత స్థాయిలో మాక్ ఎక్సర్సైజ్ (మాక్ డ్రిల్) నిర్వహించారు. నిరంతర భారీ వర్షాల కారణంగా చెరువులు నిండిపోవడం, కాలనీలు ముంపునకు గురికావడం, ప్రజలు, పశువులు నీటిలో చిక్కుకోవడం వంటి విపత్తు పరిస్థితులను ఊహించి ఈ మాక్ డ్రిల్ చేపట్టారు. చిన్నవడ్డేపల్లి చెరువు, నవయుగ కాలనీ తదితర ప్రాంతాల్లో ఒకేసారి సహాయక చర్యలను అమలు చేసి అధికారుల సన్నద్ధతను పరీక్షించారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖ బృందాలు లైఫ్ బోట్లు, లైఫ్ జాకెట్లు, రోప్ తాళ్లు, స్ట్రెచర్ల సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధులను ప్రత్యేకంగా గుర్తించి ముందుగా రక్షించారు. నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తులను లైఫ్ బోట్లతో కాపాడగా, వరద ప్రవాహంలో చిక్కుకున్న పశుసంపదను కూడా సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వరద ముంపు ప్రాంతాల్లోని ఇళ్లపై ఆశ్రయం తీసుకున్న బాధితులకు డ్రోన్ల సహాయంతో తాగునీరు, ఆహార ప్యాకెట్లు, మందులు, నిత్యావసరాలను అందించారు. రెస్క్యూ బృందాలు ఒక్కొక్క ఇంటికి చేరుకొని బాధితులకు ధైర్యం చెప్పి సురక్షితంగా తరలించాయి.

పునరావాస కేంద్రాల ఏర్పాటు
వరదల నుంచి బయటకు తీసుకొచ్చిన ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ భోజనం, తాగునీరు, బిస్కెట్ ప్యాకెట్లు అందించడంతో పాటు బెడ్లు, బ్లాంకెట్లు వంటి వసతులు ఏర్పాటు చేశారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి 108 వాహనాల్లో దేశాయిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ మాక్ డ్రిల్‌లో అగ్నిమాపక శాఖ నుంచి 35 మంది, పోలీస్ శాఖ నుంచి 35 మంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 12 మంది, ఆపదమిత్ర వాలంటీర్లు 30 మంది పాల్గొని సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ
మాక్ ఎక్సర్సైజ్ను వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెస్క్యూ బృందాల పనితీరును గమనిస్తూ అవసరమైన సూచనలు ఇచ్చారు. అలాగే ప్రథమ చికిత్స కేంద్రం, రిఫరల్ ఆసుపత్రి, పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతున్న వైద్య సేవలు, ఆహార వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విపత్తుల సమయంలో ముందస్తు సన్నద్ధత, శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని అన్నారు. ఇలాంటి మాక్ డ్రిల్‌ల ద్వారా అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన అవగాహన ఏర్పడి, విపత్తుల సమయంలో ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు.
మాక్ ఎక్సర్సైజ్ పరిశీలకులు గద్వాల డీఎఫ్ఓ అశోక్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం విపత్తుల వల్ల ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా చూడడమేనని, అందుకే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, ఆర్డీవోలు ఉమారాణి, సుమ, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్ హరీష్ రెడ్డి, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


