విద్య–వైద్యమే ప్రభుత్వ ఎజెండా
గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలి
డయాగ్నస్టిక్స్ విఫలమైతే మొత్తం వ్యవస్థే కూలిపోతుంది
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : విద్య, వైద్యం, ఉపాధి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అదే ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. సోమవారం బేగంపేటలోని ఓ హోటల్‌లో విజయ మెడికల్ సెంటర్ వైద్య సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రెండవ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో డయాగ్నస్టిక్స్ సెంటర్లు ప్రారంభించాలని విజయ మెడికల్ సెంటర్ నిర్ణయించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అన్ని రకాల పరీక్షలు చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. కొన్ని దశాబ్దాల క్రితమే లేజర్ వైద్యాన్ని సమాజానికి పరిచయం చేసిన మ్యాక్సీ విజన్ కాసు ప్రసాద్ రెడ్డి సేవలను గుర్తు చేసిన ఆయన, సూర్యనారాయణ, ప్రసాద్ రెడ్డి, వేలు ముగ్గురు బాల్య స్నేహితులు కలిసి విజయవంతంగా వ్యాపారం కొనసాగిస్తుండటం అభినందనీయమన్నారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థలో కీలకమైన తొలి రక్షణ అడుగును బలోపేతం చేసే ప్రయత్నంగా ఈ డయాగ్నస్టిక్ కేంద్రాలను అభివర్ణించారు. డయాగ్నస్టిక్స్ సక్రమంగా పనిచేస్తే వైద్య రంగంలో గందరగోళం ఉండదని, అదే అవి విఫలమైతే మొత్తం ఆరోగ్య వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం ఉంటుందని డిప్యూటీ సీఎం హెచ్చరించారు.
ప్రజారోగ్యమే మౌలిక అంశం
2023 డిసెంబర్‌లో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన సమయంలో ప్రజలు ఆరోగ్యం మాత్రమే కాదు, భరోసాను కూడా కోరారని భట్టి విక్రమార్క తెలిపారు. ఆరోగ్యం లేకుండా గౌరవం ఉండదని, గౌరవం లేకుండా నిజమైన అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. అందుకే ప్రజా ఆరోగ్యాన్ని మౌలిక అంశంగా తీసుకుని ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హైదరాబాద్ వెలుపల వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాలకు అధునాతన డయాగ్నస్టిక్ సదుపాయాలు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అలా జరిగితే ప్రజలపై పడే ఆర్థిక, మానసిక భారం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ఆధునిక వైద్యం ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడంపై ఆధారపడి ఉంటుందని, విశ్వసనీయమైన డేటా లేకుండా ప్రజా ఆరోగ్య ప్రణాళికలు సాధ్యం కావని తెలిపారు.
ఆరోగ్యం కొందరికే పరిమితమైన హక్కు కాదని, అది ప్రజా సంపదగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. వ్యాధిని చికిత్స చేయడమే కాదు, ముందుగానే అంచనా వేసే దిశగా ప్రభుత్వ విధానం ఉందని వివరించారు. న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్, విజయ మెడికల్ సెంటర్‌ల విస్తరణకు అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితత్వం, నైతికత, సానుభూతితో తెలంగాణ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. ప్రజారోగ్య సంరక్షణను బలోపేతం చేసే ప్రతి ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


