ఐక్యతతోనే గ్రామాభివృద్ధి సాధ్యం
మంచి పాలనకే శాశ్వత గుర్తింపు
బుర్రకాయలగూడెం ఆదర్శ గ్రామంగా ఎదగాలి
నూతన సర్పంచ్‌కు మాజీ జడ్పీటీసీ సూచనలు
కాకతీయ, గణపురం : మండలంలోని బుర్రకాయలగూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మాజీ జెడ్పిటిసి మోటపోతుల శివశంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన నూతన సర్పంచ్ తుమ్మల సంపత్ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శివశంకర్ గౌడ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామానికి వెళ్లి నూతన సర్పంచ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామస్తులంతా ఐక్యమత్యంతో ముందుకు సాగితే చిన్న గ్రామపంచాయతీని కూడా మండలంలోనే అభివృద్ధిలో ముందంజలో నిలిపే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామ అభివృద్ధి ఒక్కరి వల్ల కాదని, అందరి సమిష్టి కృషితోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
గ్రామానికి ఎల్లవేళలా అండగా
బుర్రకాయలగూడెం గ్రామాన్ని తన రాజకీయ జీవితంలో ఎప్పటికీ మర్చిపోనని శివశంకర్ గౌడ్ అన్నారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా తాను స్వయంగా వచ్చి పరిష్కారం అయ్యే వరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తులు తనపై చూపుతున్న ఆదరాభిమానాలను ఇలాగే కొనసాగించాలని, తాను కూడా ఎల్లవేళలా గ్రామానికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. మంచి పరిపాలన, ప్రజాసేవతో పనిచేసే ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని శివశంకర్ గౌడ్ తెలిపారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవాలంటే నూతన పాలకవర్గం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పాలన సాగించాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ తుమ్మల సంపత్‌తో పాటు వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు శివశంకర్ గౌడ్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించి, భవిష్యత్తులో తమకు మార్గదర్శకత్వం అందించాలని కోరారు.


